Press "Enter" to skip to content

హనుమంతుని కధలు – హనుమ సహాయంతో పురుషమృగంపై భీముని విజయం

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Bhima Hanuman

శిష్యుడు- గురువుగారూ! మనమింకా ద్వాపరయుగంలో ఉన్నామండీ. పురుష మృగం తేవటం కోసం భీముడు బయలుదేరాడు. సోదరుని పరీక్షించి తన సహాయం అందించాలని హనుమంతుడు నిశ్చయించుకొని అడ్డంగా ఉండి భీముని బల గర్వాన్ని పోగొట్టాడు.

గురువుగారు – మార్గాన్ని నిరోధించి తన బలగర్వాన్ని పోగొట్టిన హనుమంతుని భీముడు స్తుతించాడు. హనుమంతుడు సౌమ్యరూపం పొంది ముఖపద్మాన చిరునవ్వులు చిందులాడగా భీమునితో ఈ విధంగా అన్నాడు. “ఓ రాజకుమారా! భీమసేనా! నన్ను అంజనాసుతుడగు హనుమంతునిగా తెలుసుకో. వాయుపుత్రుడనటంవల్ల నీకు సోదరుణ్ణి. పురుషమృగాన్ని తేజూచే నీ యీ సాహసాన్ని చూహి సోదర ప్రేమ వలన కలత పొంది ఇక్కడ కూర్చొని ఉన్నాను. మనోవేగం కల్గినట్టి, గొప్ప పరాక్రమం కల్గినట్టి, మనుష్యులే ఆహారంగా కలిగి ఉన్న పురుష మృగం మనస్సుకంటెను ముందుగా క్షణంలో మార్గాన్ని అతిక్రమించగలదు. మనుష్యులుగాని, రాక్షసులుగాని, తుదకు యముడైన తన ఎదుట నిలువలేరని ఆ పురుషమృగం యొక్క అభిప్రాయం అటువంటి మృగాన్ని తీసికొని రావటానికి నీవెలా సమర్థుడవు? ఓ నా సోదరా! భీమా! పరాక్రమమెంతగ కలది అయినా, పురుషులే ఆహారంగా కలది అయినా ఆ పురుష మృగాన్ని నా సోదరుడవయిన నీవు తీసికొని వెళ్ళలేక తిరిగి వెళ్ళటమనేది జరగకూడదు. కాబట్టి దానిని తీసికొని రావటంకోసం ఉపాయం చెప్తున్నాను విను. ఆ పురుషమృగం శుభప్రదమైన ఆచారం కలది. ఎల్లప్పుడూ శివపూజ చేసేటటువంటిది. ప్రాణాపాయం సంభవించినా అది శివపూజ మాత్రం వీడదు. అంతేకాదు. ఎక్కడైనా శివలింగంకల శుభప్రదమైన దేవళం ఎదురుగా కన్పడిందా పూజార్హమైన దానిని పూజింపక ఒక్క అడుగుకూడా ముందువేయదు. అని అంటూనే ఆ ఈశ్వరాంశ సంభూతుడైన హనుమంతుడు తన తోక చివరి వెంట్రుకలను కొన్నిటిని తీసి ‘భీమా! ఇవిగో! ఈ వెంట్రుకలను మార్గ మధ్యంలో విడివిడిగా వదులు. అలా వదలిన రోమాలు శివలింగాలుగా మారి వాటిపైన ఆలయాలు కూడా ఏర్పడుతాయి. అప్పుడా ఆలయాలలో పురుషమృగం పూజ చేయవలసి వస్తుంది. ప్రయాణంలో ఈ విఘ్నాలు ఏర్పడకపోతే నిన్ను వెంటనంటి వచ్చే ఆ పురుషమృగం నిన్ను కబళించేస్తుంది. ఇవిగో! ఈ వెంట్రుకలను తీసుకో’ అని ఇచ్చాడు. ఇంకా కర్తవ్యాన్ని బోధిస్తూ హనుమంతుడు ‘ఓ అనుజుడా! ఈ వెంట్రుకలను తీసికొని శీఘ్రంగా ఆ పురుష మృగం సమీపానికి వెళ్ళు. మృగ విధాన్ననుసరించి దానిని ప్రార్థించు. ఆ మృగం చెప్పిన మాటల నాలకించు. గురుతులబట్టి వేగంగా ముందుకు వెళ్తూ విడిగా ఒక్కొక్క వెంట్రుకనే పడవేస్తూ వెళ్ళు. ఇలా దేవ సభ అయిన సుధర్మ మొదలుకొని భోజనశాల వరకూ వేగంగా ముందు పరుగెత్తుతూ పొరపాటు చెందకుండా వెళ్ళు. మార్గమధ్యంలో నీవు దానికి దొరికావా? అది నిన్ను భక్షించివేస్తుంది. ఎప్పుడైతై ఒక్కొక్క రోమం వదలి శివలింగము ఉద్బవింపజేశావో వాటి అర్చనకారణంగా మార్గమధ్యంలో నిన్ను ఆ మృగం అతిక్రమించలేదు. కబళించలేదు. ఆ విధంగా అయితే నీకు తప్పక ఈ కార్యంలో విజయం చేకూరుతుంది” అని తోకవెంట్రుకలు గుప్పెడు భీమునకందజేశాడు. పురుషమృగా హరణంలో మంచి ఉపాయం లభించినందుకు భీముడు పరమానందమంది హనుమంతుని గొప్పగా స్తుతించి ఇలా అన్నాడు.

[wp_campaign_1]

“ఓ ఆంజనేయా! సహొదరా! నీకు మిక్కిలి స్థూలమైన రూపము, అతిసూక్ష్మరూపము, సమానరూపాలున్నవని లోకంలో విన్నాను. ఓ మహానుభావా! అద్భుతమలైన ఆ రూపాలను చూడాలని కోరికగా ఉంది. కాబట్టి నాకు వాటినన్నిటిని చూపించు” అన్నాడు. అతని ప్రార్థన నాలించిన హనుమంతుడు “ఓ భీమసేనా! నీవన్నటుల నా కా రూపము లనేకములున్న మాట నిజమే. నీవు అవి జూడ దగినవే. వాని విధానం చెప్తున్నాను గుర్తుంచుకో. సీతాదేవిని  ఓదార్చునటువంటి, శింశుపా వృక్షం ఆకులలో ఇమిడి కనుపించకుండా ఉన్న నాటి ఆ రూపమున్నదే అది నా సూక్ష్మరూపంగా తెలుసుకో. లోకానుగ్రహ కారంగా ఉదయాద్రి, అస్త్రాదులపై పాదములుఉంచి సూర్యభగవానుని వద్ద వేద వేదాంగాది సకల విద్యలూ నేర్చిన నాటి రూపమున్నదే, దానిని మధ్యమరూపంగా తెలుసుకో. ఇంకా నా మధ్యమరూపాలున్నాయి. భీమా! సప్త సముద్రాలపై నా తోకతో సేతువు నిర్మించి సీతామాతచే శతకంఠరావణుని వధింపజేపిన ఆ రూపం కూడా మధ్యమ రూపమే. ఇక నాశకక్తిని చూపుచూ విశ్వమంతటికీ అద్భుతమై విశ్వమయంగా సీతాదేవికి సాక్షాత్తుగా ఏ రూపం దర్శనమీయబడిందో అది నా యొక్క స్థూలరూపం. ఆయా అవసర కార్యాలబట్టి, ఆయా కాలాలనుసరించి ఆయా రూపాలు చూపదగినవే కాని అన్ని వేళలా అంతటా చూపదగినవి కావు. ఇప్పుడు నీ వా అద్భుత రూపాలు చూచినా భయపడతావు. లోకాలు కూడా బాధనందుతాయి. అయినా పాండునందనా, నా సూక్మరూపాన్ని చూపుతాను’ అంటూ హనుమంతుడు వెంటనే నీవార ధాన్యపుకొన అంత వాడయాడు. అంతటి సూక్ష్మ రూపం ధరించిన స్వామిని చూచి భీముడు అత్యంతం ఆశ్చర్యపడ్డాడు. అంతలోనే ఆ సూక్ష్మదేహుడు హనుమంతుడు గొప్పగా రూపాంతరం చెందాడు. పదియోజనాల వెడల్పు, ముప్పది యోజనాల పొడువుగల రూపాన్ని అప్పుడు ధరించాడు. అటువంటిరూపంతోనే అతడు సముద్రాన్ని లంఘించి ఉన్నాడు. ఆ హనుమద్రూపం చూస్తూనే భీమసేనునంతటివాడు మూర్చపోయాడు. అలా మూర్చిల్లిన భీముని చూచి సోదర ప్రేమకల మారుతి భయపడవల దంటూ చేతితో భీముని తట్టాడు. హనుమంతుని హస్తస్పర్శతో నిద్దుర మధ్యలో ఉన్న వానిలాగా ఆ చైతన్యం కోల్పోయిన భీముడు తెలివిపొంది హనుమంతుని పెక్కురీతుల స్తుతించాడు. ఐదుప్రదక్షిణాలు, ఐదు నమస్కారాలు చేశాడు. సర్వాత్మకుడు దయాసముద్రుడు అయిన హనుమంతుడు సోదరుడైన భీమునికి హితవు చెప్పి అతడు చూస్తూ ఉండగానే అంతర్థానం చెందాడు.

[wp_campaign_3]

భీముడు ఆశ్చర్యం పొంది హనుమంతుని మాటలు మననం చేసుకొంటూ అతడిచ్చిన తోక వెంట్రుకలను తీసుకొని దేవసభకు చేరుకున్నాడు. ఆ సుధర్మ సభా మధ్యంలో కుంతీమధ్యముడు పురుష మృగాన్ని చూచి కుశల ప్రశ్నలు వేస్తూ దండప్రమాణాలాచరించాడు. అనంతరం ఇలా అన్నాడు. ‘ఓ పురుష మృగసత్తమా! నేను పాండురాజు యొక్క కుమారుడను భీముడను. ఇంద్రుని కుమారుడయిన అర్జునకు అన్నను. ధర్మజ్ఞుడయిన యమ ధర్మరాజు కుమారుడు, జితేంద్రియుడు మహారాజు అయిన నా అన్న ధర్మరాజు రాజసూయ యగం చేస్తున్నాడు. అక్కడ పుణ్యప్రదమైన అన్న ప్రదానశాల ఉంది. ఆ భోజనశాల శుద్ది కోసం లోకాలనే పవిత్రం చేయజాలిన నీవు రావలసిన దానివిగా కోరుతున్నాను’ అని చెప్పగానే అతని మాటలు విన్న పురుషమృగం సంతోషించి భీముని అభిమతం గ్రహించి ‘ఓ రాజా! నేను నీ మాట వలన ప్రీతినందాను. నీకు మేలగుగాక. కాని నేను పురుషులు ఆహారంగా కలదాన్ని. మనం మీ నగర ద్వారం చేరటానికి బయలుదేరి వెళ్ళే మార్గంలోనే నిన్ను భక్షిస్తాను. నన్ను నీకు దూరంగా ఉండేటట్లు చూచుకుంటూ క్షేమంగా వెళ్లు. అప్పుడు నిన్ను తినకుండా చేరుతాను’ అని తన అభిప్రాయం చెప్పి భీముడు ముందు నడువగా తాను వెనుక రాసాగింది. అది సమీపించకుండా భీముడు మధ్యలో హనుమంతుని తోక వెంట్రుకలు వేసేవాడు. వెంటనే అక్కడ శివలింగం ఉద్భవించేది. శివసేవాగ్రణి అయిన ఆ పురుషమృగం లింగాన్ని చూస్తూ అభిషేకంచేసి పూలతో పూజించేది. ఇంతలో భీముడు సుదూరం పోగల్గేవాడు. అయినా పూజానంతరం వేగంగా భీముని ఆ మృగం చేరగల్గేది. ఇంతలో మరల హనుమద్వాల రోమం వదిలేవాడు. ఇలా హనుమంతుడిచ్చిన రోమాలు పూర్తి అయేసరికి భీముడు పురద్వార ప్రవేశం చేశాడు. కాని శివార్చనముగించుకొన్న పురుషమృగం అంతలోనే వచ్చి భీముని కుడికాలు లోపల ఎడమకాలు బయట ఉండగానే పట్టుకుంది. దానిని చూచి భయపడి ‘ఓ సర్వజ్ఞా! ఇది అన్యాయం. నీ ప్రతిజ్ఞ వీడి ఇంటిలో పట్టుకుంటున్నావు. నీకే అధర్మమునందు బుద్దిపుడితే ఇక ఇతరుల విషయం చెప్పేదేముంది?’ అన్నాడు. ఆ పురుషమృగం ‘రాజా! ధర్మ మెరిగిన మీ అన్న ఏది చెప్పిన అది చేద్దాము. అంతకు మించి వివాదం లేదు’ అన్నది. ధర్మరాజు జరిగినదంతా విన్నాడు. విని ‘ఓ పురుషమృగమా! నీ యందధర్మం లేదు. కాని భీముడు ముందుగా ద్వార ప్రవేశం చేయటం వల్ల ఆ అర్థ భాగం వీడి మిగిలిన అర్థ భాగాన్నే భక్షింప దగినదానవు ‘ అన్నాడు. అలా అన్న ధర్మరాజు ధర్మ వాక్యానికి చాలా సంతసించి పురుషమృగం భీముని వదిలి భోజనశాల యందు సంచరిస్తూ శుద్ధ మొనర్చి యాగానంతరం స్వర్గం చేరింది. ‘ఓ మైత్రేయ మహామునీ! ఆంజనేయుని దయ వలన గొప్ప పౌరుషం సంపాదించుకొని చరిత్రనందిన భీముని రాజులందరి ఎదుట ప్రశంసించి ధర్మరాజు ఆతనికి యజ్ఞ ఫలభాగం ఇచ్చాడు. ఆదివారం మృగశీర్షా నక్షత్రంతో కూడి వచ్చినరోజు భీముడు హనుమంతుని పూజించి శత్రుంజయుడయ్యాడు. కాబట్టి మృగశీర్షా నక్షత్రంతో కూడిన ఆదివారం హనుమత్పర్వదినం. నాడు హనుమంతుని పూజించటం విశేష ఫలాన్నిస్తుంది అన్నారు పరాశర మహర్షి.

[wp_campaign_2]

One Comment

  1. Sunita Sunita June 25, 2011

    హనుమంతుని గురించి ఈ కధలు నాకు తెలియవు. చాలా బాగున్నాయి. రేడియో ప్రసంగాలు ఇదివరకు వచ్చేవి. ఇప్పటికీ వస్తున్నాయా? వస్తే ఏ సమయంలో తెలుపగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: