Press "Enter" to skip to content

శ్రీ దుర్గా అమ్మవారి ఆలయస్థాపనలో శ్రీ బీరక శివప్రసాదరావు గారి దివ్యానుభూతులు

శ్రీశ్రీశ్రీ జ్యోతిర్మయి దుర్గాదేవి అమ్మవారు
దేవాంగపురి, చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్

Sri Durga Ammavaru

నాహం కర్తా

పూర్వజన్మల దైవభక్తి అనంతర జన్మలలో కొనసాగుతుం దంటారు. గత జన్మానుబంధమో ఏమో కాని అమ్మ దుర్గకు నాపై చిన్ననాటినుండి ఎంతో వాత్సల్యం. ఆ ప్రభావం కారణంగా అమ్మ అంటే నాకూ ఎంతో భక్తి. దానికి తగ్గట్టుగానే ఆమె మా యింట వచ్చి చేరింది. నాకు దేవాంగపురిలో పెద్దవాళ్ళిచ్చిన రెండంతస్థుల మేడ ఉంది. అందులో ఒక గదిలో ఆమె నివాసం. పరిసరాలవారంతా శుభకార్యాలలో ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. 2009లో జ్యోతిర్మయి అమ్మ ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అప్పటినుండి ఆమె శక్తి, అనుగ్రహభావాలు ఇనుమడించాయి. ఆ తల్లి సంకల్పం మనకు తెలియదు.

నేను ఆ యింటిని అమ్మివేసే ఆలోచన చేసాను. అప్పుడు అమ్మను ఏం చేసేవాణ్ణో నిర్ణయించుకోలేదు. కాని అమ్మ నిర్ణయం మేరకు అది డెవలపుమెంటుకు తీసికొనేవారు ముందుకు వచ్చారు. బిల్డరు, ఇంజనీరులతో మాట్లాడుతున్నా. ఇంజనీరుగారు హఠాత్తుగా లేచి ఇందులో ఏదో శక్తి ఉందండీ! 16 ఏళ్ళ క్రిందట ఇలాంటి అనుభూతి ఏర్పడింది అని తన అనుభూతి చెప్పారు. ఆయన సేవ అవసరంగా భావించిన తల్లి ఆయన కటువంటి అనుభూతి కల్గించింది.

అపార్టుమెంట్లు కడితే నాకిచ్చే వానిలో ఒకటి అమ్మకోసం కేటాయిద్దామనుకున్నాను. కాని దానికి పైన వేరొకరు నివాసముండటం, కాపురాలు ప్రక్కనుండటం బాగుండదని సలహా వచ్చింది. నా స్థలం మొత్తం 13.5 సెంట్లు. అందులో మాకు కావలసినది 10 సెంట్లు మాత్రమే అని ఇంజనీరు, బిల్డరు చెప్పారు. మిగిలిన 3.5 సెంట్లు అమ్మవారు తనకోసం కేటాయించుకొందన్నమాట. అమ్మకోసం ఆ స్థలంలో భజనమందిరంగా హాలు నేర్పరచి అందులో అమ్మవారి పటాన్ని ఉంచే అలోచన మాత్రమే చేశా. శంకుస్థాపన చేసే దశలో ఉత్తరోత్తర అమ్మవారు ప్రతిష్టలు చేయించుకొంటుందేమో, దానికనుకూలంగా శంకుస్థాపన నిర్వహించటం మంచిదని అమ్మ మరొక్కరిద్వారా చెప్పించింది. నాదేముంది? అమ్మ ఆజ్ఞకు బధ్దుణ్ణి అయ్యాను.

ది.28-8-2010 శనివారం రాత్రి గం. 3-33ని.కు అమ్మవారికి ప్రత్యేకగది నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం నిశ్చయమయింది. ముహూర్తం 15 నిమిషాల్లో ఉండగా పెద్ద సుడిగాలి, ఉరుములు, మెరుపులు, జోరున వర్షం. ఇలా జరిగినదేమా అని ఆందోళన పడ్డాము. శంకుస్థాపన తీసిన గుంట నీటితో నిండిపోయింది. భక్తులు ఆ నీటిని తోడిపోస్తున్నారు. ఏం చేయాలో పాలుపోని దశ. ‘పదండి డాక్టరుగారూ! ముహూర్తానికి శంకువును ప్రతిష్టించండి’ అన్నారు శాస్త్రిగారు. పెద్ద అగాధంలోకి శంకును గొడుగుపట్టించి మా దంపతులము దిగాము. సరియైన ముహూర్తానికి స్థాపన జరిగింది. నీళ్ళలో పెట్టాము కదా, సర్ది సరిచేస్తే బాగుండునని చూస్తే ఆశ్చర్యం! టన్ను బరువున్నట్లు అది కదలలేదు. అందరం టెంకాయలు కొట్టాము. అమ్మ నిలబెట్టుకుంది మనదేముంది! అనుకొన్నాము. ఎవరు స్నానంచేసి వచ్చారో?, ఎవరు చేయలేదో తెలియదు. మొత్తానికి అందరినీ వానచే స్నానంచేయించి అంత పవిత్రంగా తనపని జరిపించుకొంది. ఇంటికి వచ్చాక నా భార్య అన్నది-“నాగవరపమ్మ సిడిమాను అప్పుడూ ఇలాగే తప్పక వర్షం వస్తుంది” అని. మాకు తప్ప మిగతావారందరికి కరెంటు పోవటం, అంత వర్షంలోనూ శంకు పెట్టటం కోసం ఇటుకలతో అప్పుడే కట్టిన కట్టుబడి మునిగిపోయినా అందులోని ఒక్క ఇటుక కూడా ఊడకపోవడం అక్కడ అందరికి ఆశ్చర్యం కల్గించింది. ఎక్కడో దగ్గర్లో పిడుగు కూడా పడ్డది. ఇదంతా అమ్మవారి మహిమే అనుకున్నాము. కాని శంఖుస్థాపన కార్యక్రమములో ఇంత పెద్ద అనుకోని వర్షం పడటం కొంత బాధను కూడా కలిగించింది. ఆ రోజంతా అలాగే నా మనస్సు చాలా రకాలుగా ఆలోచించింది. ఆ రాత్రి భోజనం చేసి పడుకున్నాను. తరువాత ఎవరో నన్ను కొట్టి లేపినట్లు “నాకేమి లేదా?” అనే మాట వినిపించింది. నేను ఉలిక్కిపడిలేచి సమయం చూసాను. రాత్రి గం.3-33నిముషాలు. అదే క్రిందటిరాత్రి శంఖుస్థాపన చేసిన ముహూర్తం. అలానే పడుకున్నాను. మరల పదినిముషములు గడిచిన తర్వాత “ఏంటీ!? 24 గంటలు అయింది. నాకు నివేదన ఏది?” ఆ మాటలు వినిపించేసరికి నాకు భయం కలిగి పడుకున్నవాడిని లేచి కూర్చున్నాను. పదేపదే అవే మాటలు “ఏంటీ!? 24 గంటలు అయింది. నాకు నివేదన ఏది?” అని వినిపిస్తూ ఉన్నాయి. నేను స్పృహలోనే ఉన్నాను. ఈ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. నేను సందేహంతో ‘ఏంటీ?’ అని అడిగాను. అప్పుడు వెంటనే దానికి సమాధానంగా “ఏంటీ? నీవు రమ్మాన్నావు, వచ్చాను. శంఖులో కూర్చోమన్నావు. కూర్చున్నాను. 24 గంటలయింది, నాకు నివేదన చేయలేదు”. నేను నా మనస్సులో ‘అంత వర్షం వచ్చింది కదా’ అని అనుకునేంతలోనే, మరల “నువ్వు పిలిచావు, శంఖులో కూర్చోమన్నావు, నా పరివారంతో వచ్చాను. ఎవరికన్నా కష్టం కలిగిందా? ఎందుకంత భయపడతారు?” అని వినిపించేసరికి అప్పుడు నా కర్థం అయింది అమ్మవారు పంచభూతాలతో వచ్చిందని. ఈ సంఘటన పదే పదే గుర్తుకు వచ్చి నిద్రపోలేక పోయాను. ఇంటికి ఎవరు వచ్చినా కనీస అతిధిమర్యాదలు చేసే నాకు విశ్వజనని అమ్మ అడిగేదాకా నేనేమి పెట్టలేకపోయానే, అమ్మచేత అడిగించుకున్నాననే బాధ నా మనస్సుని చాలా కలత చెందేటట్లు చేసింది. భారమైన మనస్సుతో పడకగదిలోనుండి బయటకు వచ్చి హాలులో కూర్చున్నాను. నన్ను చూసిన పనమ్మాయి ‘అయ్యగారు ఏడుస్తున్నారండీ’ అని నా భార్యకు తెలుపగా, ఆమె నన్ను చూసి ‘ఏం జరిగింది? పెళ్లయిన 40సం.లలో మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఎప్పుడూ చూడలేదు’ అని బాధపడింది. అందుకు నేను జరిగినదంతా చెప్పి, అమ్మవారికి పిలిచికూడా నేను ఏమి ఇవ్వలేకపోయానే అనే బాధ కలిగింది అన్నాను. నేను కూడా ఆ రోజు ఉదయం అల్పాహారంగాని, మధ్యాహ్నం భోజనం గానీ చేయలేకపోయాను. అలాగే వెళ్ళి పడుకొన్నాను. మరల అమ్మవారి మాటలు “ఏంటీ? నన్ను భూస్థాపితం చేస్తావా?” అని వినిపించేసరికి నాకు అర్థం కాక “శంఖుస్థాపన కదా” అని అనుకునేంతలో “నన్ను పైకి తీసుకురా!” అని అడిగింది. “శంఖులో ఉన్న అమ్మవారిని ఎలా పైకి తేవటం” అని మనస్సులో అనుకుంటుండగానే “స్థూపం కట్టి పైకి తీసుకురా” అనే మాటలు వినిపించాయి. “స్థూపం కట్టటం ఎలా?” అనే ప్రశ్న ఉదయించగా, మరల వెంటనే “గుండ్రంగా కట్టి నన్ను పైకి తీసుకురా” అని అంటూ, ఎలా కట్టాలో అమ్మే నాకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. నాకు అప్పుడు అర్థం అయింది. ఇది నాకు పూర్తి జాగృతస్థితిలో ఉన్నప్పుడు వినిపించిన మాటలు. కల అనుకోవటానికి ఆస్కారమే లేదు. వెంటనే లేచి స్నానం చేసి, అక్కడకి నేను ఒక్కడినే వెళ్లలేక శాస్త్రిగారికి ఫోన్ చేసి “మనము శంఖుస్థాపన చేసిన స్థలం దగ్గరకు వెళ్ళి వద్దామండీ” అని, ఇద్దరం కలసి శంఖుస్థాపన ప్రదేశానికి వెళ్ళాము. ఇద్దరం అమ్మకు అక్కడ నివేదన చేసి అప్పుడు శాస్త్రిగారికి జరిగినదంతా చెప్పాను. శాస్త్రిగారు ఆశ్చర్యంగా అమ్మ ఎట్లా చెప్పిందో అట్లా తూ.చా. తప్పకుండా చెయ్యమన్నారు. తర్వాత అమ్మ చెప్పిన ప్రకారం శంఖు పెట్టిన చోట స్థూపంగా కట్టి అమ్మవారిని పైకి తీసుకువచ్చాము. ఆరోజు నుండి ఈరోజు వరకు అమ్మవారికి నిత్యనివేదన జరుగుతూనే ఉన్నది. అమ్మవారు వచ్చి పీఠంలో కూర్చోవటం జరిగిపోయింది. ఇక అమ్మవారి ప్రతిమ పెట్టటమే మిగిలింది. అందువల్ల అమ్మవారి పటం పెట్టి భజనమందిరం కట్టే ఆలోచన పోయి అమ్మవారి ప్రతిష్ట జరగటానికి అన్ని పనులు సానుకూలంగా జరుగుతున్నాయి. నాటినుండి అమ్మవారు కూర్చొని పనులన్నీ జరిపించుకొంది. అడుగడుగునా ఆ అనుభూతులందించింది.

విగ్రహానికి తిరుపతిలో ఆర్డరివ్వబోతూ అమ్మకు చెప్పబోగా వర్షం. కాంట్రాక్టు కాగితం తెచ్చి అమ్మపాదాలపై నుంచి తెల్పుకొనబోగా వర్షం. ఇలా పుష్పవృష్టి కురిసినట్లు అనుభవాలు. అమ్మవారి విగ్రహం ఆర్డరిచ్చాక ఆ శిల్పికి కోట్లకు ఆర్డర్లు వచ్చాయట. ఆ అనుభవంతో ప్రత్యేకశధ్ధతో విగ్రహం సిద్ధం చేసి వైభవంగా పూజించి పంపాడు శిల్పి. ఎలా తేవాలా! అని అలోచిస్తుండగా, ఒకరు క్రొత్తగా ట్రక్కు కొనుక్కొని తొలుత అమ్మవారిని దానిపై తెస్తామని కోరి మరీ తెస్తుండగా నెల్లూరు భక్తులచే కదంబవృక్షాలు కూడా అమ్మకు అందింపబడ్డాయి. ఆశ్చర్యమేమంటే బయలుదేరుతూ ఉదయం వేసిన పూలదండ ఎండలో ప్రయాణించి మధ్యాహ్నం మూడు గంటలకు చేరితే పూలమాల ఏ మాత్రం వాడిపోలేదు. చూచినవారి ఆశ్చర్యానికి మేరలేదు.

Sri Durga Ammavari Temple

నిర్మాణదశలోనూ అడుగడుగనా అమ్మ నేనున్నానని నిరూపిస్తూనే ఉంది. గదికట్టి పటం పెట్టుకొని భజనలు చేసుకుందామనుకొన్న దానిని భవ్యమందిరం నిర్మించి దివ్య విగ్రహం ప్రతిష్టించే స్థితికి తెచ్చింది. ప్రతిష్టలు ఎలా జరపాలో? ఎవరు జపిస్తారో? అనుకొంటే కనకదుర్గమ్మ విజయవాడనుండే ఆ ఏర్పాట్లు జరిపిస్తూ కార్యక్రమ బ్రహ్మను నిర్ణయింపజేసింది. ఊహింపనిరీతిగా ఎవరికివారు స్వచ్చందంగా ముందుకు వచ్చి మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం అని అప్పచెప్తున్నారు. అప్పుడే గ్రామం, సమీప గ్రామాలే కాక, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, అమెరికా నుండి అనగా ఇతర దేశాలనుండి కూడా భక్తులనుండి వస్తువాహనాభరణాదులు పొందుతూ తాను విశ్వజననీనని నిరూపించుకొంటోంది. గతంలో నేను నీలకంఠపురంలో శివాలయమందు ప్రతిష్టలు నిర్వహించటం జరిగింది. నాడు నా కర్తృత్వాన్ని చెప్పుకొనగల్గా. అలా అనుకొన్నవి ఆనాడు చేయగల్గా. కాని నేడు, ఈ దుర్గా ఆలయనిర్మాణ విషయంలో నాదేముంది? అప్పుడు “నాహం కర్తా” అని నా కర్థమయింది. భవిష్యత్తును గూర్చి కూడా ఇక ఆందోళన లేదు. ఎందుకంటే, నిర్ణయాలూ ఆమెవే, ఆచరణలన్నిటి వెనుకా ఆదేశాలు ఆమెవే.

ఇంతటి శక్తిని చూపి నిలబడుచున్న ఆ దుర్గామాత తనను దర్శింపవచ్చే, పూజింపవచ్చే భక్తుల నెంతగానో అనుగ్రహింపగల దనటంలో సందేహమేముంది? అందుకే అందరం ఆమే సేవలో ధన్యులమవుదాం రండి.

అమ్మ సేవలో
బీరక శివప్రసాదరావు

Sri Durga Sarvaswam

[dm]10[/dm]

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

One Comment

  1. satya satya May 15, 2012

    Namasthe. I want to bring to your attention that the above download link is not working.

    Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: