శ్రీరామ
జయ హనుమాన్
శ్రీరామసేవా ధురంధరుడుగా కీర్తింపబడుతున్న హనుమంతునియం దసాధారణ ప్రజ్ఞలెన్నో ఉన్నాయి. కేవలం సేవక మాత్రుడైతే లోకంచే అంతగా ఆరాధింపబడడు. రాజైన సుగ్రీవునకు, ఆరాధ్యుడైన రామునకు లేనంతగా ఆలయాలు హనుమంతునకు జగమంతా ఉన్నాయి. అర్చనలు జరుగుచున్నాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే హనుమంతునితో
“ప్రతిగ్రామ నివాసశ్చ – భూయా ద్రక్షో నివారణే”
“ఓ హనుమంతా! భూతప్రేత రాక్షసాది బాధల నుండి రక్షణకోసం నీకు ప్రతిగ్రామంలో నివాసం ఏర్పడుతుంది. అంటే దేవాలయం ఏర్పడుతుంది” అని పలికాడు. ప్రతి రామాలయంలో హనుమంతుడు తప్పక ప్రతిష్టితుడౌతాడు. అవికాక హనుమదాలయాలు ఊరూరా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. ఈ కలిలో ఏర్పడే విచిత్రములైన బాధలన్నిటికీ పరిష్కర్తగా సేవింపబడుచున్నాడు.
హనుమంతునిలో ఎన్నో విధాలైన ప్రత్యేకతలున్నాయి. ఆ వానరాగ్రేసరుడు పుట్టుకతో మర్కట జాతివాడు అంటే పశుజాతి. జీవనమంతా నరులతో, మానవోత్తముడైన రామునితో జీవించాడు. యధార్థానికి ఆయన దైవమే. కేవలం దైవంకాదు.
“ఆంజనేయః పూజితశ్చేత్ – పూజితా స్సర్వదేవతాః” అన్న విధివాక్యంబట్టి సకల దైవతముల సమూహమూర్తి ఆంజనేయుడు. ఇది అసాధారణ స్థితి. పై హనుమద్విషయంలో ఒక సందేశం ఉంది. పుట్టుకతో ప్రతివారూ పశుప్రాయులే. మంచి మనిషిగా మనగల్గి ఉత్తమ సంస్కారాలు కల్గి ఉంటే దైవత్వాన్నే పొందవచ్చనే అద్భుత సందేశాన్ని హనుమంతుని జీవితం అందిస్తుంది.
సాధారణంగా మహాబలవంతులకు బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది. అద్భుతమయిన బుద్ధిశక్తి కలవారు శరీర దార్డ్యాన్ని కల్గి ఉండరు. ఇది సహజం. శక్తి సాధన చేసేవాడు పుష్కలంగా ఆహారం తీసికొంటాడు. అది అరిగేటట్లు వ్యాయామం చేస్తాడు. అందుకు తగినంతగా నిద్రపోతాడు. ఇలా తిండిపోతుగా, నిద్రపోతూ జీవించే వాడికి బుధ్ధి చురుకుదనం తగ్గిపోతుంది. ఒకవిధమైన మాంద్యం ఏర్పడుతుంది.
అలాగే జ్ఞాన సాధన చేసేవాడు నిద్రాహారాలుకూడా మానుకొనుచు కృషి చేస్తాడు. నిద్రాజాడ్యం పట్టిందా! ఇక బుధ్ధి పనిచేయదు. అలా మాంద్యం ఏర్పడకుండా ఉండటంకోసం ఆహారాన్ని మితంగా తీసికొంటాడు. శ్రమచేయటం వలన నిద్ర ఎక్కువగా వస్తుంది. కాబట్టి వ్యాయామాదుల జోలికి పోడు. అట్టివానికిక కండలెలా పెరుగుతాయి? ఆవిధంగా బుధ్ధిశక్తి సాధనచేసే వానికి విశేష బాహుశక్తి ఉండదు. ఇది లోకంలోని సాధారణ రీతి.
హనుమంతుడు అసాధారణ శక్తి వ్యక్తి. కాబట్టి పై విధానాల కాతడు అతీతుడుగా కన్పడుతాడు. హనుమంతుని మించిన బలవంతుడు లేడు.
“అతులిత బలధామ – స్వర్ణ శైలాభదేహం” అని కీర్తింపబడ్డాడు. కేవలం తాను బలవంతు డవటమే కాదు. బలవంతుల కారాధ్యుడు. బలవంతులందరకూ ఆదర్శం అతడే. అందుకే ఎవ్వరు బలసాధన చేయదలచినా హనుమంతునే ముందుంచుకొంటారు. ఆరాధిస్తారు. ఆ బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడే బలసాధకుల దైవం. ‘మారుతి వ్యాయామశాల’ అని, ‘హనుమాన్ వ్యాయమశాల’ అని ఇలా వ్యాయామ శాలలుకూడా హనుమంతుని పేరుతోనే కపడుతున్నాయి. వ్యాయమంలో అతని ఆదర్శానికి తగినట్లే ‘హనుమాన్ గుంజిళ్ళు’ అని హనుమంతుని పేరుతో ఒక విధమైన గుంజిళ్ళుకూడా ఉన్నాయి. అవి మామూలు గుంజిళ్ళ కంటె చాలా కష్టం. కష్టసాధ్యమయిన వ్యాయామం ఆతని పేరనే ప్రసిధ్ధమయింది.
ఆతని బలం అనిర్వచనీయం. రామరావణ సంగ్రామంలోను, అంతకుముందు, ఆపిదప కూడా లక్షలాది రాక్షసులను అంతంచేసిన రాక్షసాంతకుడు. జంబుమాలి, అక్షుడనబడే రావణసుతుడు, కాలనేమి, మైరావణుడు, రక్తరోముడు మొదలయిన భయంకర రాక్షసు లెందరినో అవలీలగా సంహంరించాడు. హనుమంతుని బలమును ఇంత అని తూచి చెప్పలేము. అందువలననే ‘అతులిత బలధాముడు’ అని కీర్తింపబడ్డాడు. బలశాలురయినవారు బాహుశక్తితో ఏదో సాధింపగల్గవచ్చు. చాలాగొప్ప బరువులు మోయవచ్చు. ఎందరినయినా అవలీలగా చూపవచ్చు. తూచలేనంత బలం కలవారయాక వారికి వారుకూడా భారంగానే తోస్తారు. నిలబడి పనిచేయగలరు తప్ప పరుగెత్తి సాధింపలేరు. కాని ఆంజనేయుడు ‘మనో జవం – మారుతతుల్యవేగం’ అని కీర్తింపబడ్డాడు. వాయువేగ మనోమేగములు కల్గి ఉండటం బలశాలురకు సాధ్యమయిన విషయం కాదు. అంతటి వేగం కలవాడు కాబట్టే శతయోజన విస్తీర్ణమయిన సముద్రాన్ని నాల్గు ఘడియలలో అంటే 4X24=96 నిమిషాలు. అనగా గంటన్నరలో దాటివచ్చాడు. ఇలా అన్ని విధాలయిన శక్తులు కల ఆంజనేయుని మించిన ఆదర్శం బలసాధకుల కేముంటుంది? (సశేషం)
శ్రీరామ జయ రామ జయజయ రామ
[wp_campaign_1]
[wp_campaign_2]
[wp_campaign_3]
ఆంజనేయుని గురించి బాగా చెప్పారు. ఇంకా తేలుసుకోవాలని వుంది.
-సునీత
ధన్యవాదములు సునీత గారు, ముందు ముందు ఇంకా చాలా విషయాలు పొందుపరుస్తాము. చదివి తెలుసుకోగలరు.