గోమాత
స్మృతులను పరిశీలించినపుడు ‘గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ’ అని 14 లోకాలూ గోవునం దున్నాయని, గోవునందు దేవతలంద రున్నారని పరాశరస్మృత్యాదులు వివరిస్తున్నాయి. బృహత్పరాశరస్మృతి గోదానాది మహిమ 5-34 నుండి 41 వరకు తెల్పింది. ఇంకా ‘గవాం చైవానుగమనం సర్వపాప ప్రణాశనమ్’ అని గురువువలె గోవు ననుసరించిపోవుట సర్వ పాపహరణ మనికూడా పరాశరస్మృతి చెప్పింది. మనుస్మృతి ‘గవా చాన్న మాఘ్రాతం వర్జయేత్సదా’ అని ఆవు వాసనచూచినా దాని నోటినుండి తీసికొనక దానికే వదలాలని, ‘గవాపహారీ గోధా జాయతే’ అంటే గోవు నపహరించినవాడు ఉడుముగా పుడతాడని చెప్పింది. నృగమహారాజుచరిత్ర ఇందుకు ఉదాహరణగా కన్పడుతుంది. శంఖస్మృతి ‘గోఘ్న శ్చాంధో భవేత్’ ఆవును చంపినవాడు అంధుడగునని చెప్తోంది. ‘గోమయాదినా సంస్కృతాయాం భూమౌ భుంజీత’ అని ఆవుపేడతో శుద్దిచేసినచోట భోజనం చేయమని వ్యాసుడు చెప్పాడు. గోవును కొట్టుట, తన్నుటల వలన మహాపాపం ప్రాప్తిస్తుందనీ స్మృతులు తెల్పాయి.
పురాణవిషయాలకు వస్తే పద్మపురాణం సృష్టిఖండంలో గోముఖమునందే వేదాలున్నాయంటూ ఏ అవయవములం దే దేవతున్నదీ వివరింపబడింది. గోవునందు సకల దేవతలను దర్శించి మహర్షులు తెల్పారు. గోవు కుడికొమ్ముప్రక్క బ్రహ్మ, ఎడమప్రక్క విష్ణువు, కొమ్ముల చివర సకల తీర్థాలు, నుదుట శివుడు, ముక్కునందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, చెవులందు అశ్వనీ దేవతలు, నేత్రములందు సూర్యచంద్రులు, నాలుకయందు వరుణుడు, గోవు ‘హిం’కారమున సరస్వతీదేవి, గండస్థలాల యమ, ధర్మదేవతలు, కంఠమున ఇంద్రుడు, వక్షస్థలాన సాధ్యదేవతలు, నాల్గుపాదాల ధర్మార్థకామమోక్షాలు, గిట్టలమధ్య గంధర్వులు, పృష్టభాగాన ఏకాదశరుద్రులు, పిరుదుల పితృదేవతలు, మూత్రమున గంగ, పాలలో సరస్వతి, భగమున లక్ష్మి భావన చేయదగినవారు. ఆవుపొదుగు అమృతసాగరస్థానం. ఇలా గోవు అగ్నిమయం. అమృతమయం, దేవమయం. అలాగే భవిష్యపురాణం ఉత్తరపర్వంలో ‘శృంగమూలే గవాం నిత్యం’ అంటూ స్కాందపురాణ రేవాఖండంలోను, మహాభారతం అశ్వమేధపర్వంలో కృష్ణుడు ధర్మరాజుకు గోదానమహిమ చెప్పుచునూ ఇలా గోవు సకలదేవతాస్వరూపాన్ని సకల శ్రుతిస్మృతి పురాణాదులు చెప్పాయి. అందుకే ‘సర్వదేవాః స్థితా గేహే-సర్వదేవమయీ హి గౌః’ అని గోవు సకలదేవమయికాన ఇంట్లో గోవుఉంటే సకలదేవతలు ఉన్నట్లే అని చెప్పబడింది. ఆ భావనతో గోవు నారాధించాలి. విష్ణుధర్మోత్తర పురాణంలో వరుణదేవుని కుమారుడు పుష్కరుడు పరశురాముని కోర్కెపై గోమతీవిద్య నుపదేశిస్తాడు. అది పాపాలను సమూలంగా నాశనంచేయగలదిగా చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో గోసావిత్రీ స్తోత్రం ఉంది. గోవు సాక్షాత్తు విష్ణు స్వరూపమని, దాని అవయవము లన్నింటిలోను కేశవుడు విరాజమానుడై ఉన్నాడనికూడా చెప్పింది. భారతం అనుశాసనపర్వంలో చ్యవనమహర్షి నహుషునకు చెప్పిన గోమాహాత్మ్యంలో ‘గోభి స్తుల్యం న పశ్యామి ధనం కించి దిహాచ్యుత’ – గోధనంతో సమమైన ధనం లేదు. గోవును స్తుతించటం, గోవునుగూర్చి వినటం, గోదానం, గోదర్శనంకూడా గొప్ప పుణ్యాన్ని ఇచ్చేవని ఎన్నో విశేషాలు చెప్పబడినాయి. అందే భీష్మునిచే ధర్మజునకు గోవు, భూమి, సరస్వతి అనే ముగ్గురూ సమానమంటూ గోసేవ విధికూడా చెప్పబడింది. భవిష్యపురాణోత్తర పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో ‘ సముద్రమధన సమయంలో మాతృస్వరూపులగు నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే ఐదు గోవులుద్భవించాయని, వానిని క్రమంగా దేవతలు, జమదగ్ని, భరద్వాజ, వశిష్ట, అశిత, గౌతమ మహర్షులకు లోకకళ్యాణార్థం, యజ్ఞములద్వారా దేవతల్ను తృప్తి పరుప సమర్పించారని, ఇవన్నీ కోర్కెలన్నిటిని తీర్చగలవవటం వల్ల వీనిని కామధేనువు లన్నా’రని చెప్పాడు. ఇంకను గోవునుండి వచ్చేపాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం, గోరోచనం అనే ఆరు గోషడంగాలు పవిత్రములు, పాపహరణాలని, శివ ప్రీతికరం, లక్ష్మీకరమైన బిల్వదళం, ఎర్రతామర, వాని బీజాలు గోమయమందే పుట్టాయని సుగంధమైన గుగ్గులు గోమూత్రం నుండి పుట్టెనని చెప్పబడింది. ఒకేవంశం గోవు, బ్రహ్మణులుగా విభజింపబడి మంత్రం, హవిస్సుల ద్వారా యజ్ఞకార్యమునకు నిర్ణయింపబడ్డాయని చెప్పబడింది. పద్మపురాణం సృష్టిఖండంలో బ్రహ్మ నారదునితో చెప్తూ, ‘భగవంతునినుండి గొప్ప తేజఃపుంజమేర్పడి అందుండి వేదాలు వచ్చాయని, అనంతరం అగ్ని, గో, బ్రాహ్మణులు వచ్చినందున ఈ నాల్గూ లోకం మనుగడకు ముఖ్యమైనవిగా వివరించాడు. గోప్రదక్షిణంవలన పాపం నశించి అక్షయ స్వర్గసుఖం లభిస్తుందని, గోప్రదక్షిణాలు చేయటంవలన మాధవుడు సర్వజన పూజ్యుడౌ, బృహస్పతి దేవతావంద్యుడు, ఇంద్రుడు సకలైశ్వర్య సంపన్నుడు అయ్యారని కూడా ఆ పురాణం చెప్పింది. అగ్ని పురాణంలో భగవంతుడైన ధన్వంతరిచే ఆచార్య శుశ్రుతునకు అనేక గోసంబంధమైన విషయాలు చెప్పబడ్డాయి. పంచగవ్యం ఎట్టివారినైనా పవిత్రం చేస్తుందని దానిని స్వీకరించే భిన్న పద్ధతులు, మహాసాంతపన వ్రతం, కృచ్ఛ్రాతికృచ్ఛ్రవ్రతం తప్తకృచ్ఛ్రవ్రతం, శీతకృచ్ఛ్రవ్రతం వంటివి చెప్పబడ్దాయి. ఇవన్నీ గొప్ప ఆరోగ్యసిధ్ధిప్రదాలు. గోమతీవిద్యా జపంవల్ల ఉత్తమ గోలోకప్రాప్తి చెప్పబడింది. విష్ణుధర్మోత్తర పురాణంలో కసాయివాని నుండి గోవును కొనడం, క్రూరమృగాలనుండి రక్షించడం గోమేధయజ్ఞఫలా న్నిస్తుందని, గోవ్రతం గూర్చి చెప్పబడింది. గోవును తాకడంచేతనే పాపక్షయ మవుతుందని స్కాందపురాణం ప్రభాసఖండం చెప్తోంది. ఇంకా ఋషిశాపంనుండి విముక్తికోసం శివుడు గోలోకం వెళ్ళి సురభిని స్తుతించినరీతి చెప్పబడింది. దశరధాదు లందరూ తాము చేయు యజ్ఞసందర్భాలలో వేలకొలది గోవులను దానంచేయటం చూస్తాం. రామాదుల పట్టాభిషేకాది కలపములందు గోదానాలు చేయబడినాయి. శ్రీకృష్ణుని లీల లన్నిటా గోవులకు, దూడలకు చాలాపాత్ర ఉంది. ఆవుపాల కంటే ఎక్కువ జీవనా ధారము, అభివృద్ధికరమునైన ఆహారపదార్థ మేదియు లేదని కశ్యప సంహిత చెప్పింది. శివపురాణ మందలి సనత్కుమాసంహితలో విభూది మహిమ చెప్తూ శివుడు పార్వతితో ఆవుపేడతో తయారు చేసిన భస్మమును ధరించుట లక్ష్మీప్రదము, తేజస్సును, మేధను పెంపొందిస్తుంది అంటాడు. అసలు విభూతి అంటే ఐశ్వర్యమే. లక్ష్మీస్థానమైన గోమయం వలననే దానికాస్థితి ఏర్పడింది. విభూతి ధారణవలన దేహమునందు విద్యుదుత్పత్తి జరుగుతుంది. అయుర్వృధ్ధి జరుగుతుంది. డా|| అనిబిసెంట్ విభూదిమహిమను తన గ్రంధంలో చెప్పటంవల్ల పాశ్చాత్యులు కొందరు గ్రహించు చుండగా మనంమాత్రం వదిలేస్తున్నాము.
ప్రాచీన, నవీన సాహిత్యంలోకూడా కవులు గోవుకు ఎంతోస్థానం కల్పించారు. కబీర్ ‘తుర్కీధరమ్ బహుత హమ్ ఖోజా’ అనే దోహాలో ‘మహమ్మదీయుడా! నీ ధర్మం అంతా పరీక్షించాను. ఎక్కడా గోవధ చేయమనలేదు’ అని అంటాడు. విద్వదవధానశిరోమణి కాశీవ్యాసకృష్ణకవి వ్రాసిన ‘గోజనని పద్యకావ్యం’ పేర్కొనదగినది. తులసీదాస్ గోస్వామిగానే గోసాయి బిరుదు పొందాడు. అలా గోస్వామిగా కీర్తింపబడే తులసీదాస్ తన సాహిత్యంలో గోవునుగూర్చి ఎంతగానో వ్రాశాడు. వినయపత్రికలో ‘సోఇ అసహిత సనేహ దేహభరి-కామధేను కలి కాశీ’ అని కాశీని గోవుగానే పూర్తిగా అన్వయించి వివరిస్తాడు. మహాభక్తుడు నామదేవ్ చంపబడ్డగోవును తన కీర్తనగానంచే బ్రతికించి ఢిల్లీపాదుషా మెప్పు పొందాడు. రసఖాన్ అనే మహమ్మదీయకవి జీవితాన్ని గోవుకు, గోపాలునకు అంకితం చేశాడు. సూరదాస్ సాహిత్యమంతటా గోమహిమ కన్పిస్తుంది. అక్బర్ ఆస్థానకవులలో ఒకడైన నరహరి అనే కవి వ్రాసిన ‘హరిహూదంత తృణ’ అనే గీతం విని అక్బరు చలించి తన రాజ్యంలో గోవధను నిషేధించాడు. సిక్కుల తొలిగురువు గురునానక్ ‘యహీ దేహ ఆజ్ఞా తుర్కకో ఖపావూ’ అంటూ గోహంతకులైనవారిని తుదముట్టించి ప్రపంచంలో గోహత్య దుఃఖం లేకుండా చేస్తానంటాడు. బందాబైరాగి గోరక్షకై కత్తి ఝళిపించాడు. గౌరాంగ ప్రభువు ఒకప్పుడు బెంగాలు ప్రాంతంలో గోభక్తిని నింపాడు. అన్యసాహిత్యాలలోవలెనే తెలుగు సాహిత్యంలో కూడా గోవుకు సంబంధించిన రచన ఎంతో ఉంది. పురాణవాఙ్మయము యధామూలంగా ఉండగా శివభారతంలో గడియారం వెంకటశాస్త్రిగారు ‘పదరకుము తల్లి నీకేమి భయముగలదు? బాలకృష్ణుడు నిన్ను కాపాడగలడు’ అంటారు. (ఇంకా ఉంది…)
[wp_campaign_1]
[wp_campaign_2]
[wp_campaign_3]
Be First to Comment