శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – హనుమంతుడు భీమునికి కూడ గర్వభంగం చేశాడని భారతంలోని కధ విన్నాం, అదేమిటి గురువుగారు?
గురువుగారు – ఆ! భీమునకూ గర్వభంగంజేసి అనుగ్రహించాడు. భారతంలో సౌగంధికా కుసుమం గూర్చి చెప్తే, పరాశర మహర్షి పురుష మృగాహరణం చెప్పారు. ఆయన ఇలా అన్నారు.
‘కోవా సమర్థో మైత్రేయ! సమున్మజ్జతు మంజసా
పరీవాహాద్భుతే మగ్నస్తత్కధామృత సాగరే’
‘ఓ మైత్రేయ మహామునీ! ఆ హనుమంతుని కధ అను అమృత సముద్రపు అద్భుత ప్రవాహంలో మునుగుతూ వెంటనే ఎవడు లేచిరాగలడు? కాబట్టి నీ వడిగిన మరొక్క కధకూడా విను. చెప్తున్నాను. ద్వాపరయుగంలో హస్తినాపురాన్ని కుంతీదేవి పెద్ద కుమారుడు, సద్గుణవంతుడు అయిన ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరాక్రమశాలి ఒకప్పుడు రాజసూయ మహాయజ్ఞాన్ని చేయ సమకట్టాడు. అక్కడ ధౌమ్యుడు మొదలైన పురోహితులచే చేయబడే ఆ యజ్ఞమునందు మనుజులకు పరిశుభ్రమైన శాలిధాన్యపు అన్నంతో సంతర్పణ జరిగింది. వివిధ భక్ష్యభోజ్యచోష్య లేహ్య పానీయాలు, లేగంటి ఆపుపాలు, అమృతాన్ని తిరస్కరింపజాలిన రసాలు, శరత్కాల పూర్ణ చంద్రునివలె శుభ్రమైన తెల్లనైన పెరుగులు, సకల జాతులవారికి స్త్రీ పురుష బాల వృద్ధ భేదం లేక సమర్పింపబడినాయి. వేద వేదాంగ వేత్తలే లెక్కకు మిక్కిలిగా ఉండగా ఇక సాధారణ జనులు ఇసుకవలె అసంఖ్యాకంగా వచ్చి భుజింపసాగారు. అటువంటి మహాయాగాన్ని అన్నగారు చేస్తున్న దానిని చూచి భీముడు ‘ఈ శుభ సందర్భంలో అన్నగారికి నే నేబహుమానం ఇచ్చిన బాగుంటుంది.’ అని అలోచించాడు. రత్నగర్భ అయిన భూమికే పతి అయిన ఈతనికి రత్నాలు సమర్పించటంతగదు. కోరిక లన్నిటిని ఇచ్చే దేవతల కామధేనువు వంటివి భూమిపై లభించేవికాదు. ‘భూమియందసాధ్యమైనది, రాజుకు గొప్పకీర్తి తెచ్చేది అయినదానినే తన శక్తిచే సాధించి ఇవ్వాలి’ అని తలచాడు. స్వర్గంలో పురుషమృగం యొక్క సంచారంవలన భోజనశాల లెల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి దానిని తేవలెనని భీమసేనుడు నిశ్చయించుకొని యజ్ఞశాలనుండి దేవసభ అయిన సుధర్మకు బయలుదేరాడు. తన బలమును చూచుకొన్న గర్వంతో కనుగప్పి ఉన్నవాడై తనకు ప్రమాదాని కల్గింపగల దని కూడా ఆలోచింపక, తనకుగల విశేష బంధువర్గాన్ని కూడా గుర్తింపక మనసుకు మించిన వేగంతో భీమసేనుడు ఉన్న చోటనుండి ఒక్కసారిగా బయలు దేరాడు.
ఇటువంటి కష్టమైన పనికి భీముడు పూనుకొనటం సర్వ ప్రాణులయందు దయగలవాడు, భీమునకు అన్న అయిన హనుమంతుడు గమనించాడు. సోదరుడయిన భీమునకు సాయపడదలచుకొన్నాడు. మిక్కిలి వేగంతో పరుగెత్తుచున్న భీమసేనుని త్రోవలోకి క్షణంలో చేరాడు. త్రోవకు అడ్డంగా కొండ చిలువ వంటి ఆకారం కల హనుమంతుడు పడుకొని ఉన్నాడు. శివలింగమయంగా తోచే తోకతో బాటనంతనూ ఆక్రమించి దూర ప్రయాణంచే అలసిఉన్న వానివలె నిశ్వాసలు విడుస్తూ ఉన్నాడు. పురుషమృగాన్ని తేవలెననే తొందరలోఉన్న భయంకరరూపుడైన భీముడు ఆ విధంగా అడ్డంగా ఉన్న హనుమంతుని చూచి ‘జరత్కపే! సుముత్తిష్ట-వాలం చాలయ వర్త్మనః గంతవ్యంతు మహాక్షిప్ర మితో అవసర సత్వరః’ – ‘ఓ ముసలి కోతీ! లే, నేను అవసరమైన పనిపై అతి వేగంగా ఇటు వెళ్ళాలి. త్రోవకడ్డంగా ఉన్న తోకను తీసెయ్యి. ముసలి వాడవైన కోతి చేష్ట మానలేదు. ఇలా వెళ్ళవలసిన బాటను తోకతో ఆవరించి కూర్చునావేమిటి? వన్యములైన ఆహారాలు ఏమీలేని ఈ పర్వత ప్రదేశంలో నీ కేమిపనిఉన్నాది? సరస్వతీ నదీతీర ప్రదేశాలకు వెళ్ళు. బాగాపండి తీయగఉండే మామిడి పండ్లు తినవచ్చు. తీయనైన నీరు త్రాగవచ్చు’ అని అన్నాడు. ఇలా తమ్ముడైన భీముడు బోధచేయగా హనుమంతుడు ముదుసలితనాన్ని వ్యక్తంచేసే చేష్టలతో అక్కడనుండి కదలలేదు.
తమ్ముడయిన భీముని పరాక్రమాన్ని తెలిసికొనాలనే కోర్కెకూడా అతనికి కల్గింది. అందుకోసం నెమ్మదిగా ఇలా అన్నాడు. ‘రాజన్ జీర్ణశరీరోహం – వన్యాహార వివర్జితః పిపాస యార్తితో నిత్యం – నజానే త్రిదినం పయః’ – “ఓ రాజా! నీవన్నట్లు వన్యములైన ఆహారము లేనివాడనై శుష్క శరీరుడనైనాను. ప్రతిరొజూ దాహంచే పీడింపబడుతూ మూడురోజులుగా నీటినికూడా ఎరుగకుండా ఉన్నాను. నెలక్రిందట నీవంటి పుణ్యాత్ముడు ఇక్కడకు వచ్చాడు. వివిధములైన పండ్లను తీసికొని వచ్చి నాకిచ్చి శక్తిహీనుడనై కదలలేకున్న నన్నుదాటి వెడలిపోయాడు. ముదుసలివానికి, బాధయందున్న వానికి, బాలునకు, విశేషించి స్త్రీలకు సేవ చేసినవారే యోగ్యులని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఓ రాజశ్రేష్టా! దప్పికతో ఉన్ననాకు నీరు ఇయ్యి. నా ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి దీనుడనయిన నన్ను రక్షించు. ఓ రాజా! నా దాహం తీర్చి ప్రాణాలను నిల్పి ఈ దేహాన్ని దాటి నీ యిచ్చ వచ్చినట్లు వెళ్ళు. లేదా పొడవైన వెంట్రుకలుకల్గి వ్యర్థంగా బలిసిన ఈ తోకను నీ బొటనవ్రేలితో ఎత్తి వేరొకవైపు నెట్టు. కాదా తోకను త్రిప్పి విసిరి హాయిగా వెళ్ళు. మెడపై రాక్షసుడున్నాట్లుగా నేను లేవటాని కేరీతిగానూ సమర్థుడనుగా లేను. నా ప్రాణాలు పోయే స్థితిలో ఉండికూడా రక్షకుడవైన నిన్ను చూచి స్థైర్యం చెందాయి. కాబట్టి ఓ ధర్మాత్మా! నీవు నన్ను రక్షించు. ఓ రాజా! నీవు సమర్థుడవు. దీనుడ నయిన నాయందు దయచూపు. సత్పురుషులు, దీనులు, దుఃఖితులు అయిన వారికి సహాయకులుగా ఉంటారు.” అని ఇంతగా చెప్పేసరికి భీముడు ప్రభావితుడైనాడు. దయతో అతని దీనాలాపాలు విని వృద్ధుని రూపంలో ఉన్న ఆ హనుమంతునకు పండ్లు, నీరు ఏర్పాటుచేయదలచాడు. తాకటానికికూడ తగినట్లులేని ఆ వృద్దవానరుని స్పృశించకుండనే ఆతని క్రిందకి గదయొక్క దండం పోనిచ్చి దానితో లేపటానికి యత్నించాడు. ఆ గదయొక్క దండం కాస్తా విరిగిపోయింది. దాంతో ఆతనిని ఎత్తటంలో విఫలుడయాడు. ఆ వానరుడు దారిని అడ్డుకొనటంతో తన కోరిక నెరవేర్చుకొనటానికి ఆలస్యమౌతోంది. దానితో కోపం పెరిగి భీముడు వేడి నిట్టూర్పులు విడవ నారంభించాడు.
ముదుసలి వానరాన్ని దూకి ఈ కష్టం నుండి బయటపడి వెంటనే ఆ పురుష మృగాన్ని తీసికొని రావాలని నిశ్చయించాడు. సర్వజ్ఞుడైన హనుమంతుడు తనను భీముడు దాటడానికి సిధ్ధంగా ఉన్నాడని గ్రహించి తన తోకను, దేహాన్ని పెంచటం ఆరంభించాడు. తోకను తప్పించుకొన జూచిన భీముడు అలా పెరిగిపోయే తోక వెంట పరుగెత్తుట మొదలుపెట్టాడు. అట్లా దాని అంతు కనుక్కోలేక మళ్ళీ సమీపానికి వచ్చాడు. ఆకాశాన్నంటే హనుమంతుని దేహంముందు దోమలా ఉన్న తనను చూచుకొని సిగ్గుతో భీముడు తల వంచుకున్నాడు. వానరుని పొడవును గూర్చే ఒక నిశ్చయానికి వచ్చి ఈతనిని ప్రదక్షిణం చేయటంద్వారానే సాధిస్తాననుకొని ప్రదక్షిణం చేయటానికై కుంతీనందనుడు వాయువేగంతో పరుగెత్తాడు. అయినా ఆ వానరం యొక్క తలకుకాని, తోకకుకాని అంతం చూడలేకపోయాడు. తరువాత భీముడు గదను విడిచివైచి తన పరాక్రమాన్ని నిందించుకొని ముదుసలి రూపంలో ఉన్న ఆ కోతికి సాష్టాంగ నమస్కారంచేశాడు. సిగ్గువలన గద్గదికమైన వాక్కుతో ఇలా అన్నాడు
“క్షంతవ్యోమే అపరాధోయం – త్వామివాజానిషం కపిమ్
న జానేత్వాం మహాత్మానం – విశ్వవ్యాపిన మీశ్వరం
ప్రసీద సౌమ్య రూపేణ – యేన నిర్వృతిమాప్నుయాత్”
“ఓ అజ్ఞాత మూర్తీ! నిన్ను తెలిసికొన లేకపోయిన నా తప్పును క్షమించు. ప్రపంచమంతా వ్యాపించిన మహాత్ముడగు పరమేశ్వరునిగా నిన్ను తెలిసికొనలేకపోయిన నన్ను సౌమ్యరూపుడవై అనుగ్రహించు. దోషమును పోగొట్టుకొను మార్గాన్ని అనుగ్రహించు చిన్నతనం వలన నాది తగనట్టి మూఢబుద్ది అయినది.
నా అన్న మహారాజగు ధర్మరాజు సత్యమే మాట్లాడువాడు. ఎల్లప్పుడూ ధర్మమే శరీరమై ఉండువాడు. ధర్మమునే ఆచరించువాడు. ఆయనకోసం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ నానా జనులచే క్రిక్కిరిసిఉండు భోజనశాలయొక్క శుద్దికోసం స్వర్గలోకం నుండి పురుషమృగాన్ని తీసికొని రాదలుచుకొన్నాను. ఆ నా అభిప్రాయంలో ఏ దోషం లేకపోతే నాకు నీవు అందుకు సహాయం చేయి. లేదా తిరిగి ఇంటికి వెళ్ళటానికి అనుమతైనా ఇయ్యి. నా కోరిక మేరకు ఆ పురుషమృగాన్ని తీసికొని రాలేని వాడనైతే వ్యర్థమైన ఈ మనస్సును, గదను వదలిపెట్టి నాపై ప్రేమలేని నిన్ను చూస్తూ ఇక శ్మశాన భూమికే చేరుకుంటాను ” అని మహాబలుడు, ధర్మరాజు సోదరుడు అయిన భీముడు పల్కి మనసున లక్ష్మీపతియగు విష్ణువునే ధ్యానంచేస్తూ ఉండిపోయాడు. అటువంటి పశ్చాత్తపుడైన భీముని చూచి సకల జగన్మయుడు, కపిశ్రేష్టుడు అయిన హనుమంతుడు అతని ప్రియవచనాలతో సుముఖుడై భీముని విషయంలో ప్రసన్నుడయాడు.
[wp_campaign_1]
[wp_campaign_2]
[wp_campaign_3]
Be First to Comment