గోమాత
పంజాబ్ విశ్వవిద్యాలయం వారొక ప్రయోగం చేశారు. కొన్ని ఆవులు, కొన్ని గేదెలకు లెక్కప్రకారం కొంత మేతలో DDT కల్పి తినిపించారు. కొద్దిరోజుల తరువాత ఆ అవుల పాలలో 5% మాత్రమే DDT అంశాలుండగా ఆ గేదెల పాలలో 12% DDT ఉంది. DDT కల్పిన నీటితో గేదెల్ని కడిగినా వాటి పాలలో DDT అంశం ఉన్నట్లు తేలింది. ఆవులందు అలాకానరాలేదు. ఆవుపేడ, మూత్రములందున్న ఔషధగుణాలు, దివ్యశక్తి గేదెపేడ, మూత్రము లందు లేవు. ఆవుపేడవేసిన పైర్లకు పురుగు రాదు. పండే ధాన్యము పుష్టికరంగా ఉంటుంది. గేదెపేడతో పురుగు వ్యాపిస్తుంది. రసాయనాలవల్ల మరీ ఎక్కువగా పురుగు వ్యాపించే ప్రమాదముంది. అలా పండే పంటవలనా అనేక అనర్థాలున్నాయి. అవన్నీ నేడు మనం అనుభవిస్తున్నాం. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అని ఆరోగ్య శక్తి సూర్యునివలన లభిస్తుంది. గోవు వెన్నుపై సూర్యనాడి ఉంది. దానిద్వారా గోవు సూర్యకిరణములందలి సౌరశక్తిని ఆకర్షిస్తుంది. ఆ కారణంగా గోవు సంబంధ మైనవన్నీ పవిత్రములు, అరోగ్యప్రదములు అవుతున్నాయి. శ్రీకృష్ణపరమాత్మ 1) గోవు, 2) భగవద్గీత అనే రెండు పవిత్రవస్తువులను సమాజం ముందుంచాడు. గోవు, గురువు, గంగ, గాయత్రి, గోవిందుడు, గీతలను గకారషట్కం అంటారు. అందు గోవు ప్రధమస్థానీయం. ‘గవార్థే భూపతి స్సద్యః ప్రాణానపి పరిత్యజేత్’ అని గోవు కోసం రాజు ప్రాణత్యాగమైనా చేయవలనెనని చెప్పబడగా నేటి పాలకులు గోవుప్రాణాలనే హరిస్తున్నారు. ‘గో భూ తిల హిర ణ్యాజ్య – వాసో ధాన్య గుడాని చ, రౌప్యం లవణ మిత్యాహుః – దశదనాః ప్రకీర్తితాః’ అని దశదానాలలో తొలిదానం గోదానమే. ‘గోదానేన సమం దానం నాస్తి నాస్త్యేవ భూతలే’ అని గోదాన సమంలేదని చెప్పబడింది. ‘భూప్రదక్షిణ షట్కేన – కాశీయాత్రా యుతేన చ, సేతుస్నాన శతై ర్యచ్చ – తత్ఫలం గోప్రదక్షిణే’ అని గో ప్రదక్షిణం చేయుటవల్ల ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలం, పదివేలసార్ల కాశీయాత్ర, వందసార్లు సేతు స్నానము చేసిన ఫలితం చేకూరుతుంది. ‘గోభి ర్న తుల్యం ధన మస్తి కించిత్’ అని గోవుతో సమానమైన ధనంలేదు.
భారతదేశం గోజాతి సమృద్ధిగా ఉన్ననాడు స్వర్ణయుగాన్ని అనుభవించింది. అందుకే భారతదేశాన్ని గోవ్రత దేశంగా పిలిచేవారు. భారతదేశంలో కూడా తెలుగువారికి గోరక్షణ మరీముఖ్యమైనది. ఎందుకంటే మనకు ‘తెలుగు’వారను పేరు రావడానికి కారణం గోవే అని భాషాశాస్త్రం చెప్తోంది. ‘సరసా స్తిలవ ద్గావో – యత్రసన్తి సహస్రశః సదేశ స్తిలగుర్నామ’ అనేది అందుకు ప్రమాణవాక్యంగా చూపుతోంది. తిలలు అంటే నువ్వులు. నల్లని నూవులవలె నల్లగా ఉండే గోవులు శ్రేష్టములంటారు. ‘గోవుల లోపల కపిల బహు క్షీర’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో వ్రాశాడు. తిలలవంటి గోవులు వేలాదిగా ఉన్న ఈ ప్రదేశం పూర్వం ‘తిలగు’ అని పిలువబడేదని, ఆ ‘తిలగు’ శబ్దంనుండే ‘తెలుగు’ శబ్దం వచ్చిందని భాషాశాస్త్రం వివరిస్తోంది. అలా మనం నిజమైన తెలుగువారం కావాలంటే గోవులను ఆంధ్రదేశమంతటా పోషించి వృధ్దిచేయాలి. ఈ గోవు హిందువులకు ఆరాధ్యదేవత. హిందూసాహిత్యం శ్రుతి స్మృతి పురాణాదిక మంతా గోవును పలువిధాల ప్రశంసిస్తోంది. వేదాలు ధర్మానికి మూలాలు. ఋగ్వేదంలో గోవులకు సంబంధించిన ఒక ముఖ్య మంత్రం ఉంది. అది ప్రత్యక్షంగా గోవిషయం చెప్తూ పరోక్షంగా ‘హిందు’ శబ్దాన్ని ప్రతిపాదిస్తుంది. వేదమంత్రాలు ‘పరోక్షప్రియా ఇవహి దేవాః’ అన్నట్లు ముఖ్యవిషయాలను కూడా పరోక్షంగానే చెప్తాయి. ‘సప్తసింధు’ నుండి హిందు శబ్ధం రావటమేకాక వేదంలో ఇలా ‘హిందు’శబ్దం సూచిత మని విజ్ఞులంటారు. ఆ ఋగ్వేద 1-164-28 మంత్రం “‘హిం’ కృణ్వన్తీవ సుపత్నీ వసూనాం వత్సమిచ్చన్తీ మనసౌభ్యాగాత్ | ‘దు’ హామశ్విభ్యాం పయో అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభాగాయ ||” – హింకారంచేస్తూ ఐశ్వర్యం పెంచే మనసా సంతతియొక్క వృధ్ది కోరుచూ పాలను దేవవైద్యులకై సమర్పిస్తూ మన సౌభాగ్యంకొరకై అభివృధ్ది పొందునుగాక! అనే అర్థంకలఈ మంత్రంలో తొలిపదం మొదట ‘హిం’, రెండవపాదము మొదట ‘దు’ వర్ణాలే గోవ ద్వారా ‘హిందు’త్వాన్ని ప్రకటిస్తున్నాయని పండితుల వ్యాఖ్య. ఇందలి ‘అఘ్న్యా’ శబ్దం గోవును చంపదగదని కూడా సూచిస్తోంది. ఇదే మంత్రం అధర్వణవేదం (9-10-5) లోకూడా ఉంది. ‘హిందు’ శబ్ద నిర్వచనంకల విశిష్టమంత్రంకాన అటకూడ స్థానం పొందింది. ఇలా ‘అఘ్న్యా’ శబ్దం గోవు చంపదగనిది అని చెప్తూ ఋగ్వేదంలోనే 16సార్లు ప్రయోగింపబడింది. అందుకే ‘అఘ్న్యా ఇతి గవాంనామ – క ఏతా హన్తు మర్హతి’, ‘గోవుపేరే చంపదగనిదని, కాన గోవును ఎవడు చంపగలడు?’ అని భారతశాంతిపర్వంలో ప్రశ్నింపబడింది.
మరో ముఖ్యమంత్రం –
‘మాతా రుద్రాణాం – దుహితా వసూనాం, వస్వాదిత్యానా మమృతస్య నాభిః
ప్ర నువోచ చికితుషే జనాయ – మా గా మలగా మదితం వధిష్ట’ (ఋగ్వేదం 8-101-15)
గోవు రుద్రులకు తల్లి, వసువులకు కుమార్తె, ఆదిత్యులకు సోదరి. అమృతమువంటి పాలు, నెయ్యి మొదలగువానికి గోవే మూలకారణం. ఈ ప్రకారం జనులకు మహోపకారముమొనర్చు గోవును వధింపరాదని ఋగ్వేదంలో చెప్పబడింది. అట్లే ‘న తా నశన్తి న భాతి’ మంత్రంలో ‘గోవులను ఎవ్వరూ నాశనం చేయరు, దొంగిలించరు, శత్రుత్వంతో నష్టం కలిగించరు’ అని చెప్పబడింది. ఎందుకంటే అవి దైవకార్యానికి, దానాలకు ఉపకరిస్తూ చిరకాలం మనతో ఉంటాయి. ‘గావో భగో గావ ఇంద్రో’ మంత్రంలో గోవులే మన ముఖ్యధనమని, ఇంద్రుడు మనకు గోధనం ఇస్తాడని, ‘యూయం గావో మే దయధా’ మంత్రంలో ‘ఓ గోవులారా! మీరు కృశించిన వానిని బలిష్టునిగాను, తేజోహీనుని సుందరునిగాను మీ మంగళప్రద శబ్ధంచే నా యింటిని మంగళమయంగాను చేస్తున్నారని, కాన సభలో మీ కీర్తిని గానంచేస్తా’నని చెప్పబడింది. దీనియందు గోవుయొక్క ప్రయోజనాలు వేదమే చెప్పినది. ‘ప్రజావతీః సూయవసే’ మంత్రంలో నీవు సంతోషంతో సుఖంగా, సుభిక్షంగా ఉండాలని చెప్పబడింది. అందుకు తగినరీతిగా మనం వర్తించాలని అర్థం. ఋగ్వేదంలో గోవు అదితి అని, దేవత అని సంబోధింపబడింది. ఋగ్వేద ప్రధమమండలం 2వ అనువాకం, 4వ సూక్తం, 3వ ఋక్కు ‘ఉపనస్సవనాగహి సోమస్య సోమపాః పిబ గోదా ఇంద్రదేవతో మదః’ మంత్రం ఇంద్రుని సోమరసం త్రాగుమని, నీ సంతోషం మాకు గోవుల నిస్తుందని అంటుంది. యజ్ఞఫలం గోప్రాప్తిగా భావించటమంటే గోవు విలువ స్పష్టం. అట్లే 1-3-9-78లో ఇంద్రుని వాక్కు గోవుల నీయగలదని, 1-3-10-87లో గోధనాన్ని ఇంద్రుని కోరటం, 1-3-11-105లో గోదాన ఫలము, 1-4-12-107లో బలాసురుడు అపహరించిన గోవును ఇంద్రుడు విడిపించడం ఇలా ఎన్నో మంత్రాలు గోసంబంధమైనవి ప్రతి అనువాకంలో కన్పడుతాయి. కొన్నింట ఉదకాది అన్య అర్థాలుకూడా అన్వయించవచ్చు. (ఇంకా ఉంది…)
[wp_campaign_1]
[wp_campaign_2]
[wp_campaign_3]
Its very enlightening, in my 68 years of life, I feel that I have gained much from the subject. My Paadaabhivandanamulu to Bhrmasri. Dr Sastry Garu
really felt happy by reading all . instead of praising you i will also join with you and share these valuble info to my friends or others.
ammavari anugram mee meeda ellappudu umdaali korukumtoo.
Thanks
Vinay Kumar CH