Press "Enter" to skip to content

శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి (The Birthplace of Sri Hanuman – Anjanaadri)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి

Anjanaadri

ఆంధ్రవాజ్ఞ్మయము సవిస్త్రముగ హనుమంతుని సంపూర్ణచరిత్రను ప్రదర్శించుటలో కారణమనదగిన ప్రధానమగు నాత్మీయత యొక్కటి కలదు. హనుమంతుడు ఆంధ్రుడగుట. హనుమంతుడు ఆంధ్రుడనుటకు నాతని జనన, జాతి, దేశవిచారమే ప్రధానాధారము. హనుమంతుని నాటి జన్మస్థలము ఈనాటి ఆంధ్రదేశ మగుటవలన హనుమంతు డాంధ్రులకు సంబంధించినవాడుగ బరిగణింపవచ్చును. అట్టి ఆంధ్రదేశీయమగు హనుమజ్జన్మస్థల విషయమును హనుమద్గ్రంధము లన్నియు నెలుగెత్తి చాటుచున్నవి. అందుకు పురాణ ప్రమాణములును స్పష్టముగ గలవు.
స్కాందపురాణాంతర్గమగు వేంకటాచలమాహాత్మ్యమున నిట్లు కలదు. తనననుగ్రహించిన మతంగమహామునితో అంజన “ఓ విప్ర! మహాపురియయిన కిష్కింధయందు పుత్రసంతానము లేక దుఃఖించి వివిధ వ్రతముల నాచరించితిని…” అని చెప్ప నా మహాముని “సువర్ణముఖీనదికి ఉత్తరభాగమున వృషభాచలము, దాని అగ్రభాగమున స్వామి పుష్కరిణియు గలవు. ఆ నదిలో స్నానమాడి వరాహునికి నమస్కరించి వేంకటేశునికి ప్రణమిల్లి ఆకాశగంగా తీర్థమున కభిముఖముగ నుండి వాయుదేవునిగూర్చి తపమాచరింపు” మని చెప్పెను. ఆమెయు నట్లే యొనర్చి శ్రీహనుమంతుని బడిసినట్లు కలదు. పై వాక్యముల గల స్థలముల బట్టి యవి నేటి ఆంధ్రదేశమందలి తిరుపతి – తిరుమల ప్రదేశములని స్పష్టము. కావున హనుమంతుని ఆంధ్రదేశ సంజాతునిగ భావింపవచ్చును.

ఈ విషయమునే పరాశరసంహితయందలి “తతః కాలే మహాదేవః పర్యట న్పృధివీమిమాం, పార్వతీసహితః శ్రీమాన్ – వేంకటాఖ్యం గిరిం గతః” అను వాక్యము; బ్రహ్మాండ పురాణమునందలి తీర్థఖండమునగల

“అంజనే! త్వం హి శేషాద్రౌ – తప స్తప్త్వా సుదారుణం
పుత్రం సూతవతీ యస్మాత – లోకత్రయ హితాయ వై ||
ప్రసిధ్ధం యా తు శైలో య – మంజనే! నామత స్తవ
అంజనాచల ఇత్యేవ – నాత్ర కార్య విచారణా ||”

అను వాక్యములు ననేకములు ప్రమాణముగ నుండు “తిరుపతి ఏడుకొండలలో అంజనాదేవి తపస్సు చేసిన పర్వతము అంజనాద్రి” అని స్పష్టముగ సంకలన గ్రంధములు, తదితరములు నెన్నియో చెప్పుచున్నవి. ఇట్లు జననప్రదేశము ఆంధ్రముగ స్పష్టమగుచున్నAnjanaadriది.

సుగ్రీవమంత్రిగా వసించిన ప్రదేశముబట్టి కూడ అతడాంధ్రునియే భావింపవచ్చును. ఆంధ్రప్రాంతమున కొక యంచున జననము కాగా మరియొకయంచున నివాసము. అట్టి నివాసస్థలమగు కిష్కింధ బళ్ళారిప్రాంతమునకు చెందనది. కొమర్రాజు లక్ష్మణరావుగారిది యిదే యభిప్రాయముగా “కిష్కింధ, పంచవటి స్థలనిర్ణయ” మను శీర్షికవలన దెలియును. బళ్ళారిప్రాంత మాంధ్రమునదగినది. “ఆంధ్రులెవరు? వ్యాసమున కర్త గాదె నరసింహారావు బళ్ళారి ప్రాంతమువారి నాంధ్రులుగా దెల్పెను. సురవరం ప్రతాపరెడ్డి యీ విషయమునే “బళ్ళారిజిల్లాలోని చుట్టుపట్లనే పంప, ఋష్యమూకాద్రి ప్రదేశాలున్నాయని స్థానికు లందు’ రనుచు, లాంగ్ హస్టుగారు రామాయణములో వర్ణింపబడిన కిష్కింధ హంపీప్రాంతములోని దనుటలో సందేహము లేదు’ అనిరి. కాన పంపాతీరమే పంపాసరస్సు. అది అనెగొందెవద్ద కలదు. తుంగభద్రకే తుంగభద్రకే ప్రాచీనకాలమున పంపయని పేరు. ఋష్యమూక పర్వతం నిజామురాజ్యం సరిహద్దులో కలదు. మతంగపర్వతం హంపి వద్దనే యనెను. హనుమత్కధా తరంగిణియందీ విషయమును స్పష్టపరచుచు ‘కిష్కింధారాజ్యమాంధ్రులది. వాలి సుగ్రీవు లాంధ్రులు. హనుమంతుడు నేటి తిరుపతి కొండమీద నాకాశతీర్థము చెంగట జనియించినాడు. తిరుపతి ఆంధ్రులది. హనుమంతుడు నాంధ్రజాతీయుడే’ అని అవ్వారివారు వివరించిరి.

ఇక నీ జాతినిగూర్చి ప్రతాపరెడ్డి ‘రామాయణ వానరులు కోతులుకా రనియు వారు దక్షిణాపధమం దుండు ఆటవికులని నా అభిప్రాయము’ అనెను. కాశీభట్ట బ్రహ్మయ్యకూడ వీరు శాఖామృగములు కానేరరని, హీనానాగరికత కల్గియుండు నొక తెగ మానవులనియు జెప్పినదానిని ఖండించుచు గోపరాజు రామదాసు “అందరికంటే పెద్దతోక గల హనుమంతునికే బుద్ధి తక్కువైతే అంతపని ఎటుల చేయగల్గును” అని దానిని ఖండించెను. అంతియుకాక వానరులు సవరజాతి వారనియు జెప్పబడెను. “ఋష్యమూకలోని ‘మూక’ ద్రవిడపద మనియు ‘రా’ అనగా సవరభాషలో నేను గనియు నా పదమును కిష్కింధAnjanaadriలోని కిండాస్ అను సవరభాష పదమునకు ‘వెనుకప్రక్క కష్టసాధ్యంగా వెళ్లదగినది’ కిష్ – కింధ అనియు వివరించెను. చిన్నవారు పెద్దవాని భార్యను పెండ్లాడుట, ఆకులదొన్నెలతో కల్లు త్రాగుటలు కూడ సవరజాతి ఆచారములని వివరింపబడెను. చింతా దీక్షితులు ‘శబరి’ నాటకమున సవరకన్యతో నాడుకొనుచునే హనుమంతుడు ప్రవేశించును.

‘రామాయణమందలి వానరు లెవరు? వారేరి?” అను కాశీభట్ట బ్రహయ్యశాస్త్రి వ్యాసములో ‘వీరభద్రరావుగారి వానరులు’ అను పేరాలో ఆంధ్రులే ఆ వానరులన్న విషయము గలదు. హనుమంతుడు లంకను చూచినవారలలో మొదటివాడు. ఒక్క తెనుగులో మాత్రము ‘లంక’ యనగా చుట్టు నీటిచే చుట్టబడియుండు భూప్రదేశమనుచు గూడ గోపరాజు రామదాసు హనుమంతుని యాంధ్రునిగా గ్రహింపజెప్పెను.

కావున పురాణాదిక ప్రాచీన ప్రమాణములవలనను, ఆధునిక విమర్శల ఆధారమునను హనుమంతుడు తిరుపతి జన్మస్థలమగుటవలన కిష్కింధా పరిసర నివాసాదులవలనను ఆంధ్రుడని గ్రహించుటలో అనౌచిత్యము ఉండదని భావింపవచ్చును.

ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: