శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – గురువుగారూ! హనుమంతునికి తన శక్తి తనకు తెలియదనీ, ఇతరులు స్తుతిస్తే సమస్త శక్తినీ గ్రహిస్తాడని అంటారు. నిజమేనాండీ?గురువుగారు -నిజమే. ఆ విషయం చెప్తాను. విను. పైన చెప్పిన విధంగా హనుమంతునకు సకల దేవతల వరాలవల్ల ఎనలేని శక్తి ఏర్పడింది. పుట్టుకతో వానరుడు, చాపల్యంలో బాలుడు, విజృంభణలో తిరుగులేని సామర్థ్యం కలవాడు. దాంతో హనుమంతుని పట్టగలవారు లేకపోయారు. ఎదురులేకపోవటంతో హనుమంతుని అల్లరికూడా పెచ్చుపెరిగింది, మితిమీరింది. మిగిలినవారి విషయంలో వలెనే ఋషుల విషయంలోకూడా హనుమంతుడు అల్లరి కొనసాగించాడు. వారి అంగవస్త్రాలు చింపుతూ దర్భాసనాలు చెట్లపైకి విసిరివేస్తూ, చెట్లపై నుండి మునులమీదకు పండ్లు, కాయలు విసురుతూ, వారి వస్తువులు పారవేస్తూ ఇబ్బందులు కల్గించటం మొదలుపెట్టాడు. వారు హనుమంతుని భవిష్యజ్జీవితం తెలిసినవారు కాబట్టి సహనంతో గడపసాగారు. ఒక తపస్సంపన్నుడు హనుమంతుని అల్లరి భరింపలేక “ఏ శక్తిని చూచుకొని నీ వింతటి బాధలు మాకు కల్గిస్తున్నావో ఆ శక్తి నీవు మరచిపోదువు గాక!” అని శపించాడు. దాని ప్రభావంతో ఆక్షణంనుండి మారుతి అశక్తునిలా నిర్లిప్తుడై సంచరింపసాగాడు. అసాధారణ కార్యముల సాధింపవలసిన ఆ నిర్లిప్తతనుకూడా మునితతి చూచి సహింపలేకపోయింది. కాబట్టి వెంటనేవారు బాగా ఆలోచించి “ఎవ్వరయినా నీబలపౌరుషాలు స్మరించి గుర్తుకు తెచ్చిన యొడల నీ శక్తి యుక్తులు ఎప్పటియట్ల గుర్తింపగలవు, విజృంభింపగలవు” అని శాపానికి పరిహారంచూపారు. దాంతో హనుమంతునిలోని పనికిరాని అల్లరి పోయింది. పరిపూర్ణ సద్గుణ గరిష్టుడుగా నిలచాడు. కాబట్టి నీవు విన్న మాట యధార్థం. హనుమంతుడు పొగిడిన పెరిగెడి స్వామియే. ఎవరైనా పొగిడినా, బాగా కోపం తెప్పించినా విజృంభిస్తాడు.
అనంతరం మారుతికి విద్యాభ్యాసానికి తగిన వయస్సు వచ్చింది. వెంటనే తల్లి అంజన “నాయనా! నీవు ఇక కష్టించి సకల విద్యలు నేర్వవలసిన సమయమయింది. జగచ్చక్షువు, లోకమంతటికి తనకిరణ స్పర్శతోనే జ్ఞానోదయం కల్గించే సూర్యుని మించిన గురువులేడు. కాబట్టి ఆ సూర్య భగవానునివద్ద విద్యల నభ్యసించ”మని చెప్పింది. తల్లి మాటను శిరసావహించాడు హనుమంతుడు. విద్యనార్జించుటానికై సూర్య భగవానుని దగ్గరకు బయలుదేరాడు. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడూ అయికూడా లోక సంగ్రహణం దృష్టియందుంచుకొని వేదాధ్యయనం చేసే నిమిత్తం సూర్య మండలానిక వెళ్ళాడు. సూర్యునకు వినయపూర్వకంగా నమస్కారంచేశాడు. ఆ ప్రభాకరునితో ఇలా అన్నాడు “ఓ సూర్యదేవా! వేద వేదాంగాలు, ఉపాంగాలు సర్వమూ నీదగ్గర నేను అభ్యసింపదలచాను”, అనగానే సూర్యుడు “అంజనానందనా! నేను ఈశ్వరుడవశుడనై ఆ సర్వేశ్వరుని ఆజ్ఞ మేరకు ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాను కాబట్టి నీకు విద్య చెప్పే అవకాశం నాకెలా సమకూరుతుంది?” అన్నాడు. హనుమంతునకు కోపంవచ్చింది. వెంటనే సూర్యుని మార్గాన్ని అడ్డగించాడు. దాంతో సూర్యుడు “ఓ హనుమంతా! నీకు విద్యలు బోధించటానికి నాకెట్టి అభ్యంతరంలేదు. కాని వానిని ఎలా వినగల్గెదవో నీవే ఉపాయం ఆలోచించు. ఆ విధంగానే చేద్దాము” అంటూ హనుమంతుని కోపాగ్నిని చల్లబరచాడు. గురువైన సూర్యునకు అభిముఖుడై హనుమంతుడు సూర్యుడు పోవలసినవైపే వెనుకకు నడవటం ఆరంభించాడు. సూర్యుడు తన గమనాన్ని యధావిధిగా కొనసాగిస్తూనే పాఠ ప్రవచనం చేయ నారంభించాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, తదంశచే ఉద్భవించిన హనుమంతుడూ సర్వజ్ఞుడే కాబట్టి ఒక్క వారం రోజులలో మారుతి ఇంద్ర వ్యాకరణాంతం నేర్చుకొనగల్గాడు. హనుమంతుని విద్యాగ్రహణ శక్తిని, శ్రధ్దను, శక్తి యుక్తులను భాస్కరుడు బహుధా ప్రశంసించాడు. హనుమంతునకు తన అనంతశక్తి భావనకు వచ్చింది. అలా వెనుకకు వెళ్తూ నేర్చుకొనటంకాక మరో ఉపాయం ఆలోచించాడు ఆ పవన నందనుడు. ఒక పాదం ఉదయాద్రిపైన, మరోపాదం పశ్చిమాద్రిపైన ఉంచి సూర్యు నెదురుగా నిలవబడినవాడై సాంగోపాంగంగా వేదాదుల నభసిస్తూ ఉన్నాడు.
హనుమంతుని శ్రధ్ధా భక్తులు సూర్యునకు ఆశ్చర్యంకల్గిస్తున్నాయి. సూర్యుడు ఒక్కసారి గతాన్ని ఆలోచించుకొన్నాడు. విశ్వకర్మకు మహాసాధ్వి అయిన సంజ్ఞ (ఛాయ) అనే కుమార్తె ఉంది. ఆమెను విశ్వకర్మ సూర్యునకిచ్చి వివాహంచేశాడు. ఉత్తమరాలైన సంజ్ఞాదేవి (ఛాయదేవి) సూర్యభగవానుని తీక్ష్ణకిరణాలను భరింపలేకపోయింది. ఆ ప్రభాకరుని తేజస్సును సహింపజాలక విచారమగ్నయై కాలం గడుపుతూ ఉంది. ఆ పరిస్థితిని గమనించిన తల్లి ఆమె విచారానికి కారణం అడిగింది. తన సమస్యను సంజ్ఞ (ఛాయ) తల్లితో చెప్పుకుంది. భర్త కడ తాను ఉండజాలనని బాధను వ్యక్తం చేసింది. సూర్యుని తీక్ష్ణ కిరణాలకు నిలువలేకున్న కుమార్తె పరిస్థితిని గూర్చి సంజ్ఞ (ఛాయ) తల్లి తన భర్తయైన విశ్వకర్మకు చెప్పింది. విశ్వకర్మ దానికి ఉపాయం ఆలోచించాడు. సూర్యునకు పరిస్థితిని తెలియబరచాడు. అతని తేజస్సును కొంత తగ్గించటానికి ఆమోదంపొంది సాన బట్టినవాడై కొంత తేజస్సును వేరుచేయగల్గాడు. ఆ వేరుచేయబడిన తేజస్సునువలన ఒక కన్య ఏర్పడింది. బ్రహ్మాది దేవతలందరూ ఆ కన్యయొక్క సౌందర్యానికి, కాంతికి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని సమీపించి “ఓ పరమేష్టీ! ఈ అద్భుతకన్యకు భర్త ఎవరు కాగలరో చెప్పవలసింది” అన్నారు. బ్రహ్మదేవుడు విచారించి “ఓ దేవతలారా! పరమేశ్వరుని మహత్తేజమగు హనుమంతుడే ఈమెకు భర్త కాగలడు. ఆకాశంలోని సూర్యుని పండుగా భ్రమించి ఆ మహాతేజోరాశినే పట్టుకొనగల్గిన బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడు హనుమంతుడే ఈమెను భరింపగలడు” అని సమాధానం చెప్పాడు.
[wp_campaign_1]
Be First to Comment