శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. ఎక్కువ నియామములు కల్గిన తపస్సు లేక మంత్రానుష్టానము సాధారణ భక్తులకు సాధ్యమైనది కాదు. సద్గురు ననుగ్రహం లభించి మంచి సమయంలో తద్గురూపదేశమంది ఏకాగ్రతతో సాధన చేయాలి. అందు జరిగే లోపాల వలన సాధకులకేగాక గురునకు కూడా సమస్యలు ఏర్పడుచుంటాయి. అంతటి ప్రయాసలు లేక ఎల్లరకు సులభసాధ్యమైన మార్గం స్తోత్ర పఠనం.
స్తుతిప్రియులు కానివారుండరు. పొగిడి పని చక్కపెట్టుకొను రీతి లౌకిక ప్రపంచంలోకూడా ఎక్కువగనే చూచుచుంటాము. దేవతలు స్తోత్రప్రియులు. చక్కగా స్తుతించి వారి యనుగ్రహం పొందగల్గుట ఎల్లరకు అనుకూలమైన మార్గం. ముఖ్యంగా హనుమంతుడు పొగిడిన పెరిగెడి స్వామి. అందుకే పాఠకులు, భక్తులు అగువారికి హనుమదనుగ్రహ సంపాదనకు మంచి సాధనంగా ఈ శ్రీహనుమత్ స్తోత్ర కదంబాన్ని అందిస్తున్నాము. ఆయా స్తోత్రములు ఫలితములు అక్కడనే స్థూలంగా సూచింపబడినాయి.
అన్నిటికి ఏకైక ప్రయోజనం హనుమంతుని దయాదృష్టిని మనపై పడునట్లు చేసికొనటం. సాధన వలన యివి అన్నీ మహామంత్రములవలె సిధ్ది నందజేయ గలవే. ఎన్ని లౌకిక ప్రయోజనములున్ననూ పార లౌకికము ముఖ్యముగ కాంక్షింపదగినది. దానినాసించి జన్మ చరితార్థము గావించుకొనుటకై సాధన నొనర్చుట ద్వారా మా కృషిని సార్థకము చేయగోరుచున్నాము. దీక్షల యందు వీనిని పారాయణార్థము వినియోగించకొనవచ్చును. సాధన లేక మహామంత్రములుకూడా వ్యర్థములగునని, సాధన వలన యిట్టి స్తోత్రములుకూడ సకల ప్రయోజన సాధకములుగా గలవని యధార్థము గ్రహించి వీనిని సద్వినియోగము గావించుకొనగోరుచున్నాము.
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి
[wp_campaign_1]
Be First to Comment