శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – గురువుగారూ! మనం హనుమంతుని జన్మ గూర్చి చెప్పుకుంటున్నాము కదా! ఇంతవరకూ అయన తల్లిదండ్రుల విషయమే రాలేదేమండి?
గురువుగారు – ఆ! అదే విషయం మైత్రేయ మహామునికూడా పరశర మహర్షి నడిగాడు. పరాశరులవారి మాటల్లోనే ఆ విషయం చెప్పుకొందాం విను. పైప్రశ్న వినగానే పరాశర మహర్షి
“సాధుపృష్టం మహా ప్రాజ్ఞ – మైత్రేయ మునిసత్తమ!
సర్వోజన! కృతార్థోయం – హనూమ జ్జన్మవార్తయా”
అన్నారు. ఓ మైత్రేయ మహామునీ! నీవు బాగా ప్రశ్నించావు. ఆ హనుమజ్జన్మ విషయం వినటం ద్వారా జనులెల్లరూ కూడా ధన్యులౌతున్నారు. కాబట్టి ఇక వినవలసింది.
పూర్వం రాధంతర కల్పంలో కశ్యపుడు అనే బ్రాహ్మణోత్తముడుండేవాడు. అతడు సర్వ శాస్త్రాల తత్వమూ తెలిసినవాడు. వేద వేదాంగాలూ చివరిదాకా చదివినవాడు. ఆయన భార్యతోసహా కైలాస పర్వతంచేరి తపస్సు చేయటం ప్రారంభించాడు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలో ఉండి, హేమంతఋతువులో నీళ్ళ మధ్యభాగంలో ఉండి, వర్షఋతువులో వంగిన రెల్లునందుండి కఠోరమైన తపస్సు చేశాడు. అలా చాలా ఏళ్ళు తపస్సు చేస్తూ ఉండగా ప్రకృతి దేవతలైన అగ్ని, వాయువులు కలిసివచ్చి ఆ కశ్యపునికి పరిచర్యలు చేయ నారంభించారు. మంచి వాసనలుగల పుష్పాలు, తీయనైన చిగుళ్ళవంటి పండ్లు, సమిధలు, ధర్భలు, మెత్తనైన పూజ ద్రవ్యాలు నిత్యం సమయానుకూలంగా అందజేసేవారు. ఇలా చాలాకాలం గడిచింది. అటువంటి తపస్సుకు సంతసించి పంచముఖుడు, త్రినేత్రుడు అయిన పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి అధిరోహించి వచ్చాడు. ఆ పరమశివుడు త్రిశూలం, డమరుకం వంటివి పది చేతులతో ధరించాడు. కుండలా లలంకరించి ప్రసన్న ముఖం కల్గి ఉన్నాడు. ఎడమ భాగంలో పార్వతీ దేహం ప్రకాశిస్తూ ఉండగా ఆ కైలాస పర్వత శిఖరాన కశ్యపునితో ఇలా అన్నడు. ‘ఓ కశ్యపా! నీవిలా ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీకు కావలసిన పరమేమిటి? చెప్పు. నీ కోర్కె చెప్పావంటే ఇప్పుడే దానిని తీరుస్తాను. ఏ మాత్రం సందేహించక చెప్పవలసింది’ అన్నాడు. వెంటనే పరమానందంతో వందనంచేసి కశ్యపుడు ‘భగవన్! మమ పుత్రస్స్యా – స్త్వమిత్యేష వరోమమ’ – ‘ఓ పరమేశ్వరా! నీవు నాకు పుత్రుడవు కావాలి. ఇదే నా కోరిక’ అన్నాడు. సర్వభూతములందూ దయాళుడై ఉన్న ఆ కైలాసవాసుడు వెంటనే ‘తధాస్తు’ అన్నాడు. అంతటితో ఆగక ‘ఓ కశ్యపా! హనుమన్నామంతో నీకు నేను పుత్రుడనౌతాను’ అని వరమిచ్చాడు. అక్కడే వున్నారు కశ్యపుని సేవిస్తున్న అగ్ని వాయువులు. వెంటనే వారు కలుగజేసికొని తమ కాధారభూతుడైన అష్టమూర్తి ఆ పరమశివునితో ‘ఆవయోరపి పుత్రత్వం భజ శంభో!నిజజ్ఞయా’ ‘ ఓ పార్వతీపతీ! మాయందుకూడా నీవు అలాటి దయనే చూపుచూ నీవు మాకుకూడా పుత్రుడవయే భాగ్యం కల్గింపవలసింది’ అన్నారు. ఆ అనుగ్రహమూర్తి వారియందుకూడా దయచూపి అగ్ని, వాయువులకుకూడా అలాగే వరమిచ్చి అంతర్థానం చెందాడు. అనంతరకాలంలో ఓ మైత్రేయా! ఆ కశ్యపుడే కేసరి అనే పేరుగల వానర శ్రేష్టునిగా పుట్టాడు. వానర జాతికంతటికీ నాయకుడై చిత్ర విచిత్ర మణి శాలలు కల పదహారువేల బంగారు పర్వత శ్రేష్టాలకు అధినాయకుడైనాడు. ఆ కశ్యపుని భార్య, మహా పతివ్రత, కోమలాంగి అయిన సాధ్య అనేపేరుకల ఉత్తమురాలే గౌతమ మహామునికి భార్య అయిన అహల్యయందు అంజన అనే పేరుతో కుమార్తెగా పుట్టింది. శుభలక్షణాలన్నీ కల్గియన్న ఆ అంజన సర్వేశ్వరుని ఆజ్ఞప్రకారం కేసరికి ధర్మపత్ని అయింది. (ఇంకా వుంది….)
[wp_campaign_1]
Be First to Comment