శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం – శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ – సర్వ విఘ్నో శాంతయే ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పర బ్రహ్మా – తస్మై శ్రీ గురవే నమః ||
బుధ్ధిర్బలం యశోధైర్యం – నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ – హనుమత్స్మరణా ద్భవేత్ ||
సంహితా స్మృతి కర్తారం – వ్యాసతాతం మహామునిమ్
పరాశర మహం వందే – గురుం శుక పితామహమ్ ||
హనుమాన్ కల్పవృక్షో మే – హనుమాన్ మమ కామధుక్
చింతామణి స్తు హనుమాన్ – కోవిచారః? కుతోభయం?
శిష్యుడు – శ్రీ గురుభ్యో నమః
గురువుగారు – హనుమదనుగ్రహ ప్రాప్తిరస్తు – సర్వాభీష్ట సిద్ధి రస్తు.
శిష్యుడు – గురువుగారూ! హనుమంతుని గూర్చి పరాశరమహర్షి తన సంహితలో విశదీకరించారు – కాని, హనుమంతుని చరిత్ర రామాయణంలో వ్రాసి అందించింది మహర్షి వాల్మీకి కదా?
గురువుగారు – మంచి ప్రశ్న వేశావు. వాల్మీకి రామ చరిత్ర చెప్తూ, సందర్భవశాన, కావలసిన హనుమంతుని చరిత్ర చెప్పాడు, కాని, హనుమంతుని సంపూర్ణ చరిత్ర అందులోలేదు. అది పరిపూర్ణంగా పరాశర మహర్షే చెప్పారు. రామాయణంలో త్రేతాయుగ గాధ మాత్రమే చూడగలం. హనుమంతుడు చిరంజీవికదా! కాబట్టి ఆయన చరిత్ర త్రేతాయుగమే యేమిటి? ద్వాపరయుగంలోనూ ఉంది. కలియుగంలో కూడా ఉంది. అందుకే ఆ చిరంజీవి, మహావీరుడు జ్ఞానినామగ్రగణ్యుడు అయిన హనుమంతుని సమగ్ర చరిత్ర మైత్రేయ మహర్షిని ముందుంచుకొని, పరాశరమహర్షి కల్పాంతరచరిత్రలతో సహా లోకానికి చెప్పారు. ఈ పరాశర సంహిత హనుమత్పురాణమే. దానిని మనం చెప్పుకొందాం.
శిష్యుడు – గురువుగారూ! హనమంతుని చరిత్ర అన్నాక జనన బాల్యాలతోనే మొదలవటం పద్ధతి కదా! అసలు ఆహనుమంతుడు ఎందుకు జన్మించాడు? ఎవరికి ఎల జన్మించాడు? బాల్య విశేషాలేమిటో ముందు వినిపిస్తే తెలిసికొని సంతోషిస్తాం. సంతోషించటమే కాదు. పుణ్యం కట్టుకుంటాము.
గురువుగారు -సరే అలాగే చెప్తాను. ఒకప్పుడు రాక్షస బాధను భరింపజాలని దేవతలందరూ బ్రహ్మను శరణువేడి ఈవిధంగా అన్నారు. ‘ఓబ్రహ్మదేవా! రాక్షసాధములు అనుక్షణం మమ్మల్ని, ఋషులని, లోకాలన్నిటినీ కూడా పీడిస్తున్నారు. వారు నాశనమయే ఉపాయం చెప్పవలసింది. ఎటువంటి కష్టాలందైనా నీవేకదా మాకుదిక్కు!’ అంటూ మొరపెట్టుకున్నారు. వారిని చూసి బ్రహ్మదేవుడు ‘ఓ దేవతలారా! ఆ రాక్షలందరినీ మట్టుపెట్టటానికి అర్హుడైన శివుని దగ్గరకు వెళ్దాము’ అని బయలుదేరాడు. శివుడు వీరి ప్రార్థనవిని ‘ఓ దేవతాశ్రేష్టులారా! పరమ క్షేత్రమైన బదరికావనంలో ఉన్న నరనారాయణులు మనకు రక్షకులు, కాబట్టి అందర వారినే శరణువేడుదా’ మని శంకరుడు చెప్పాడు. బ్రహ్మాది దేవతలంతా శంకరుని వెంట బదరికావనం ప్రవేశించారు. ఆ జగన్నాధునకు నమస్కరించి ‘ఓ నారాయణప్రభో! నిత్యమూ రాక్షసులు మమ్మల్ని చాలా భాధలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళనుచంపే ఊపాయం చెప్పవలసింది అన్నారు. ఆ నారాయణుడు ఒక్కక్షణకాలం ధ్యానంలో చూశాడు. ‘ఓ దేవతలారా! రాక్షసనాశనం తప్పక జరుగుతుంది. అందులో సందేహ మేం లేదు’ అంటూ బ్రహ్మయొక్క, సకలదేవతలయొక్క తేజస్సు నాకర్షించి తన తేజస్సుతో కలిపి ముద్దగాచేసి ఈశ్వరుని కిచ్చాడు. పరమశివుడు దానిని మ్రింగాడు. వెంటనే ఆ విష్ణువు ‘ఓ దేవతలారా! ఈ తేజస్సునుండే బలవంతుడైన వానరుడు పుడతాడు. ఇక మీరందరూ నిశ్చింతగా వెళ్ళిపోవలసింది’ అన్నాడు. అనంతరం, కొంతకాలానికి ఈశ్వరుడు భూమండలమంతా పర్యటిస్తూ పార్వతితో కలిసి వేంకటాచలం చేరాడు. సత్పురుషులకు శరణ్యుడైన శ్రీనివాసుడెల్లాప్పుడూ వసించుటకు అర్హమైన పర్వతమది. పండితులు మొదలు పామరులదాకా అందరూ ఆదేవుని అనుగ్రహంచే తమతమ కోర్కెలు పొందుతూ ఉంటారు. ఆదంపతులు అటువంటి శేషశైలం మీద చిత్రవనంలో మిక్కిలి ఆనందంకల్గించే స్వచ్చమైన జలాలతోడి సరస్సులు కలచోట కొంతకాలం విశ్రమించారు.
[wp_campaign_1]
ఆ సందర్భంలో పార్వతీదేవి రతియం దిష్టం కల్గి ఆడుకొంటూ ఉన్న కోతిజంటను చూచింది. సిగ్గుతో తల వంచుకొంది. ఆమె మనస్సులో ఉన్న ఇష్టాన్ని గ్రహించాడు సర్వజ్ఞ పరమశివుడు. తాను కపిరూపం ధరించి ఆమెనూ కపిరూపం ధరింపజేశాడు. చాలాకాలం ఆ కపిరూపంలో ఉన్న మంగళరూపంతో కపిరూపధారుడైన శివుడు క్రీడించాడు. అలా క్రీడిస్తూనే సకల దేవతాశక్తిగా నారాయణునిచే ఈయబడిన తేజస్సును ఆ పార్వతీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. రతి చాలించి స్వస్వరూపాలు పొందారు పార్వతీపరమేశ్వరులు. పార్వతి శివునిచే తనయందు నిక్షిప్తం చేయబడిన ఆ మహాతేజస్సును భరింపలేకపోయింది. దాన్ని అగ్నిదేవుని యందు ఉంచింది. అగ్నిదేవుడుకూడా ఆ మహా తేజస్సును ధరించటానికశక్తుడయ్యాడు. అతడు దాన్ని వాయువునందు ప్రవేశపెట్టాడు. (ఇంకా వుంది….)
Be First to Comment