శ్రీ రామ
జయ హనుమాన్
‘కనబడేదల్లా నాశనమయ్యేదే’ అంటూ ‘యద్దృశ్యం తన్నశ్యం’ అంటారు. ఇక శాశ్వతము, చిరంతనము అయినదేమిటి? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమేనేమో. ‘ఆకాశం గగనం శూన్యం’ అని అన్నారు కాబట్టి అన్నీ నాశనమైన పిదప మిగిలేశూన్యం ఆకాశమే. తార్కికులు ‘శబ్దగుణక మాకాశం’ అని అనటంవల్ల ఆ ఆకాశంద్వారా శబ్దమనే గుణంమాత్రం ఆకాశ మున్నంతకాలం ఉంటుంది. ఆశబ్దమే శ్రుతి. అందువలననే శ్రుతి చిరంతరం, సర్వప్రమణంకూడా. ఆశ్రుతి అనబడు వేదం మనకు ఋగ్యజుస్సామాధర్వణాలుగా నాల్గుగా తెలియుచున్నా ‘అనంతా వై వేదాః’ అనుదానినిబట్టి వేదము లనంతము లనే గుర్తించాలి. ఆయా మహర్షులు తపశ్శక్తితో వానిని వినగలరు.
ఈనాల్గు వేదాలుకూడా ఒకనాడులేవు. అనగా వినబడలేదు. అందుకే ‘ఏకో వేదః కృతే హ్యాసీత్ – త్రేతాయాం స త్రిధా భవత్’ అని క్రమంగా ఈనాటికి నాల్గువేదాలు విన్పడ్డాయి. త్రయీ అని వేదం మూడుభాగాలుగానే పలుచోట్ల ప్రజయోగింపబడుతూ ఉంటుంది. ఆవేదాలు మన రేడియో ప్రసారాలు రేడియో అనే యంత్రంవల్లనే వినగలమేకాని ఆసాధనం లేక వినలేనట్లే శ్రుతినికూడా తద్గ్రహణమునందు యోగ్యమగు తపశ్శక్తియున్న వ్యక్తే విని విన్పించగల్గుతాడు. సృష్ట్యాదిలో బ్రహ్మకూడా తపంచియే శ్రుతిని వినగల్గి ‘ధాతా యధా పూర్వ మకల్పయత్’ అన్నట్లు పూర్వరీతిని సృష్టికల్పనం చేస్తున్నాడు. ఇదే శ్రుతి చిరంతనతకు ప్రబల తార్కాణం. శూన్యమనేది కూడా లేకపోయినా వేదంమాత్రం శాశ్వతంగానే ఉంటుంది. కల్పకల్పానా అందుతుంది.
నాల్గువేదాలలో యజుర్వేదం ముఖ్యంగా కర్మప్రతిపాదక మైనా ఆ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు హనుమంతునిగూర్చి చెప్పాయి. ఋగ్వేదం అనేక సూక్తాలకు, దైవప్రార్థనలకు నిలయం. దైవ విషయాలకు స్థావరమైన ఆ ప్రధమవేదంలో హనుమంతునిగూర్చి ఎంతగానో తెలియజేయబడింది. ఋక్కుల గానమే విశేషంగాగల సామవేదమునందూ హనుమన్మంత్రాలు కానవస్తాయి. అధర్వణ వేదమునకు సంబంధించిన ఉపనిషత్తే స్వామిపేరిట ప్రకటనమైయున్నదికాన వేదములన్నీ హనుమంతుని గూర్చి తెలియజేయుచున్నట్లే. వేదవిదులెందరో తమతమ బుద్దిశక్తికొలది వివేచన మొనర్చి లోకకళ్యాణమునకై కల్యాణ ప్రకాశనముద్వారా హనుమద్భక్తులకై హనుమత్సరమైన విశేషములెన్నో అందించారు.
కావున హనుమంతునియందు విశేష విశ్వాసమునకై దీనిని వైదిక ప్రమాణముగా గ్రహించుటయేకాక కాలాంతరముల మహనీయుల పరిశోధనకై దీనిని పదిలమొనర్చుకొనుచు భక్తులు హనుమత్సేవలో యధాసంభవముగా దీనిని వినియోగించుకొని రుద్రాంశసంభూతుడు, శ్రీరామభక్తుడుగా, హరిహరాద్వైతమూర్తియగు శ్రీహనుమ త్పరాత్పరు ననుగ్రహమునకు పాత్రులగుదురుగాక!
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి
[wp_campaign_1]
[dm]2[/dm]
Be First to Comment