మార్గశిర మాసమున శుద్దత్రయోదశి హనుమద్వ్రతము.
మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.
మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జనకాత్మజా – మహావీరేణ ధీమతా ||
అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. ఈరోజు హనుమంతుని పూజించినవాని కోరికలు తీరి దుఃఖనివృత్తి అగునని సీతమ్మతల్లి వరమొసగినది.
వ్రత విధానము
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యథోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.
హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.
వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.
శ్రీ హనుమద్వ్రత కధలు
చతుర్థ అధ్యాయము
అనంతరము ఫలించిన తపస్సులు కల్గిన, శౌర్య శీల సంపదలుకల, సమస్త రాక్షసగణమునకు మేలుచేయు నీలుడు మనమున నిట్లు చింతించెను. శత్రువులను భయపెట్టని పరాక్రమము వ్యర్థము. మా కులధర్మము దేవతల జయించి కీర్తినందుట అని అసురనాయకుడు, శత్రు భయంకరుడునగు నీలుడు తలచి దండయాత్రకు నిశ్చయించి ఒక్క దూతను పిలిచి యిట్లు పల్కెను. ఓదూతా! అమరావతి కేగి ఇంద్రునితో నా మాటగా చెప్పుము. నా పెదతండ్రియగు రావణుడు యుద్దమున కఠోరుడు. పూర్వము వానిచో యుద్దమునకు పిలువబడినవాడవై క్రోధమూనితిని. అప్పుడు గొప్ప మాయాస్త్రములతో మీకు యుద్దము జరిగెను. నా సోదరుడగు మేఘనాథుడు నిన్ను లంకక గొనివచ్చెగదా! అప్పుడు బ్రహ్మ సమీపించి ఇంద్రజిత్ అను పేరుతో పొగిడి అతని అన్ని వరముల నిచ్చి నిన్ను విడిపించి వెడలెకదా! ఇది యంతయు గురుతేకదా! కావున యుద్దముచేయ శక్తి లేదు. కాన నింద్రుడా! నీవు చింతామణి మొదలగు శ్రేష్ఠమగు దివ్యరత్నములను నా కిమ్ము.
అటు పిమ్మట స్వర్గపురి కేగి శచీదేవి భర్తయగు, కొండల రెక్కల నూడ్చుటయందు సమర్థమగు వజ్రాయుధము ధరించిన దేవేంద్రుని దూత చూచెను. ఎడమవైపున శచీదేవికల్గి, దేవతలచే సేవింపబడును. గంధర్వాప్సరోగీతములచ కీర్తింపబడువాడును, బృహస్పతిచే నీయబడిన ఆశీస్సులు కలవాడును, అతడు అప్సరాంగనల నృత్యము తిలకించుచు సభామధ్యమున విరాజిల్లుచుండెను. అంతట దూత గర్వముగా నీలునిచే చెప్పబడినది పలుకజొచ్చెను. దూతచే జెప్పబడిన వాక్యమును విని దేవేంద్రుడు కోపముతో నిట్లు పల్కెను. ఓయీ! బలుడు, పాకాసురుడు, జంభాసురుడు మున్నగువారు నాచేతియందలి వజ్రాయుధముచే చంపబడిరి. వారిలో కొందరు రాక్షసులు పాతాళలోకమున దాగి భయముతోనుండిరి. అట్టి రాక్షసులలో ఎవరితో నాతడు సమానుడు? ఆటోపాతిశయముతో బ్రకాశించునట వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుడనగు నన్ను యుద్దరంగమున జూడగలడు.
వజ్రాయుధపు దెబ్బకు యుద్దమున వందకోట్లరాక్షసులను సహింపలేరు. నీలుడన నెంత? అని సంరంభమున బల్కినవాడై తన ప్రక్కనున్నవానితో నింద్రుడు ‘దూతను హింసించరాదు. కానున వీని చేతులను బంధించి వెంటనే ఈ యహంకారికి శిఖ తెగవేసి వీడుడు’ అనెను. అది విని వారట్లే చేసిరి. ఆ దూత మిక్కిలి దుఃఖించెను. ఆ క్షణమే వెళ్ళి దూత యాతురతో నీలునితో జెప్పెను. అతండును కోపగించినవాడై భేరీ నినాదములచే దిక్కు లన్నింటిని ఛేదించుచు రథముల టెక్కెములచే నెగయు గాలులచే క్షోభచెందు నదీ జలములు కల్గి, సేన చేతులందలి కత్తుల కాంతిచే జనుల కనుల గప్పువాడై కాల్బలపు పాదఘట్టనచే పొడిపొడి చేయబడిన కొండప్రదేశములు కలవాడై సేనతో కూడి దీనత వీడి ధైర్యముగా నింద్రుని చేరెను.
ప్రళయకాల మేఘగర్జనతో సమమగు భయంకరమగు నట్టహాసము చేయ దిక్పాలకులందరు కలతబడి వెంటనే సేనతో గూడినవారై వెడలి ఇంద్రుని చుట్టూ చేరిరి. వారితో కూడినవాడై, ఒప్పెడు గొప్పపదునుగల వజ్రాయుధముచే ప్రకాశించు చేయి కలవాడై, దేవతలు ప్రక్కన ఉండగా జయశీలుడగు నింద్రుడు యుద్దభూమికి వెడలెను. అటుపిమ్మట దేవతలకు రాక్షసులకు జగత్తున మిక్కిలి భయముకల్గించు, భీకర సింహనాదములతో కూడిన గొప్ప యుద్దము జరిగెను. అప్పుడు నక్షత్రములు నేలబడెను. సముద్రము లింకెను. చంద్రుడు భ్రమసెను. సూర్యుడు మార్గము వీడి పయనించెను. భూమి సంచలించెను. ఆదిశేషుని పడగలు వేగముతో మహావాయువుల వ్యాపింపజేసినవి. ఇట్లు దేవదానవులకు సంకురసమర మేర్పడగా రాక్షసుల మాయను నిర్మించి దేవతలను సముద్రమున ముంచినట్లా మాయలో ముంచి వారు మాయామోహితులు కాగా సింహనాదము లొనర్చిరి.
నిలబడు శక్తిలేనివారై దేవతలు భయముతో నలువైపుకు బరుగిడజొచ్చిరి. అట్టి దేవతల నందరను చూచి ఇంద్రుడు కోపముతో కూడినవాడై భయంకరమగు శత్రుభేరీ శబ్దముల విని తన తెల్లని యేనుగగు నైరావతము నెక్కినవాడై శత్రుకీలకమును భేదించగల వజ్రాయుధమును చేతబూని రాక్షససమూహముయొక్క హుంకారములచే నహంకరమును విజృంభింపజేయుచు వేగముగా రాక్షసనాయకుడగు నీలు నెదుర్కొనెను. సమీపించినవాడై కోపముతో రాక్షసనాయకునిగూర్చి ఇట్లు పల్కెను. నా కుమారుడగు వాలి పూర్వము నీతండ్రి సోదరుడగు రావణుని తోక వెంట్రుకచేతనే బంధించి సముద్రములందు ముంచెత్తెను.ఆ వృత్తాంతము నీ పెదతండ్రినుండి వినలేదా? ఈ విషయము ముల్లోకము లెరుగును. బలపౌరుషాదు లున్నను పూనుకొని యోడితిని. అందుకు సిగ్గుపడలేదా? అంత బలపౌరుషములు కల్గియు జారుడ వగు నీవు గౌతముని భార్యను సంగమించ కోడి వైతివికదా! ఇంద్రుడా! నీ పౌరుషము లోకవిదితమే అని పరిహాసముల బల్కి ధనుస్సు సిద్దము చేసి నీలు డింద్రునిపై బాణముల వైచెను.
ఆ బాణములన్నింటి నింద్రుడు క్షణమలో ఛేదించిన నీలునివంటినికూడ విరవైచెను.అతడు మరియొక వింటినిగొనగా వాని నింద్రు డనేక రీతుల గొట్టెను. అటుపిమ్మట నీలుడు చంద్రహాసముతో వజ్రాయుధము మొక్కపోవునట్లు కొట్టెతీను. అంతట ఇంద్రుడు కోపముతో నైరావతమునుండి దిగి అంకుశమును తీసికొని దానితో మేఘధ్వనికల ఇంద్రుడు రాక్షసుడగు నీలుని గొట్టెను. అప్పు డాతడు గదను తీసికొని అంకుశమును త్రుంచెను. పిదప నీలుడు దేీవేంద్రుని బట్టి కత్తితో జంప సమకట్టినవాడు కాగా నెరిగి యాక్షణముననే బ్రహ్మదేవుడు వచ్చి ‘నీల! సాహసించవద్దు’ అని పల్కి వాని ప్రయత్నము నాపి వెంటనే వానితో నిట్లనెను. ఓ నీలుడా! నీలుడా! నీ తండ్రియగు విభీషణుడు విష్ణుదేవునకు భక్తుడు ఈ ఇంద్రు డా విష్ణువున కగ్రజుడు. కాన నామాట వినుము. ఈతనితో స్నేహముచేసి వజ్రాయుధమును వీడుము. చింతామణిని, కల్పవృక్షమును, కామధేనువును నే నిచ్చెదను. ఎల్లప్పుడు దేవేంద్రునితో స్నేహముకలవాడవై యుండుము.
విభీషణుని యుత్తమపుత్రుడా! వేరొకటి చెప్పుచున్నాను వినుము. పూర్వము మహాతపస్సంపన్నుడగు నత్రిమహాముని హిమాచలపర్వతమున మిక్కిలి సంచరించెను. అతని నేత్రములనుండి యొక తపోమయమగు దివ్యతేజస్సు వెలువడెను. అదియె కల్పవృక్షములందు పెక్కురీతుల వ్యాపించెను. అట్టిదానిని స్వయముగా వాయువు రెండురాశులుగా జేసెను. అందొకరాశినుండి సౌందర్యనిధియగు చంద్రుడుద్భవించెను. పిమ్మట రెండవరాశినుండి ముల్లోకములందలి కన్యలకంటె శ్రేష్ఠమగు వనసుందరీకన్య యుద్భవించెను. అటు పిమ్మట చంధ్రుడు శివుని శిరోభూషణమయ్యెను. అతనిచే నీ సుందరీకన్య మధువుచే పెంచబడెను. అట్టి యామె కూతుతనము నంది సంపూర్ణమగు యౌవనము నంది సాటిలేని సౌందర్యముతోనున్నది. ఆమెను కూడ చింతామణ్యాదులతో నీకీయగలను. నీచే సమస్తవిద్యలకు రాజ్ఞి,రామభక్తు శ్రీహనుమత్ప్రభు మంత్రముపాసింపబడినది.
హనుమద్వ్రతము మృగశీర్షా నక్షత్రమున జేయబడినది. అందుచే ఓ బుద్దిమంతుడా! మాబోంట్లచేతను నీ వర్చింపదగినవాడ వైతివి. సువ్రతుడవగు నీలుడా! వెంటనే సకలము సిద్ధించు రహస్యమగౌ వేరొకదానిని చెప్పుచున్నాను. ఇది యింతకు పూర్వ మెవ్వరికిని నాచే చెప్పబడలేదు. మాఘమాసమున రుద్రదేవతాకమగు నార్ద్రా నక్షత్రమునను, ఫాల్గుణమాసమున నదితి యధిష్టాన దేవతగాగల పునర్వసు నక్షత్రమందు, చైత్రమాసమున పుష్యమి నక్షత్రమున – పుష్యమి నక్షత్రాధి దేవత బృహస్పతి అందే సవితృ దేవతాకమగు హస్త నక్షత్రమునను హనుమత్ప్రభువుని పూజ సల్పవలెను. లేకున్న జ్యేష్ఠమాసమునందు పై నక్షత్రములైదింట నీవ్రతము సేయనగును. పైవ్రత సంబంధిత తోరమునే దినదినము పూజింపనగును.
ఒక్కపూటే తినుట, నేలపై పరుండుట, ఇంద్రియజయుడై, బ్రహ్మచర్యనిష్ఠ నుండుటతో పంచవక్త్ర హనుమన్మహామంత్రము నూటయెనిమిది సార్లు జపించనగును. ఎంతోకొంత మంత్రము ఆ పర్వదినముల జపించవలెను. ఐదుగురు బ్రాహ్మణులకు చక్కగా దాన మీయవలెను. నీలుడా! ఆ వాయనమును ఐదైదు అప్పములతోను, ఐదైదు పండ్లతోను. ఈయవలెను. పిదప ధనలోభం లేక గురువును నర్చించవలెను. ఐదుగురు బ్రహ్మచారులను పూజించి తగినంత బ్రాహ్మణసమారాధన సేయవలెను. సాక్షాత్తు హనుమంతుని కథతోకూడ చేయు నీ వ్రతమువలన ఎనలేని ఆయురారోగ్య ధనధాన్యాది సంపద లేర్పడును. విజయము సిద్ధించును. పుత్రపౌత్రాదులు కల్గి మంగళకరమగు సౌభాగ్యము చేకూరును. ఇంక పెక్కుమాటలేల? దీనివలన సర్వము సిద్దించును. కావున నీవు జాగరూకుడవై శ్రేష్ఠమగు నీవ్రతము నాచరింపుము. ఎల్లప్పుడు విజయము చేకూర్చు మహాసిద్ది యేర్పడగలదు. అనేక వందలవేల సంవత్సరములు వలయు గోర్కెలను, భోగములను అనుభవించి ఒక్క యంశతో వైకుంఠమునందు భగవత్కింకరులలో శ్రేష్టుడవౌదువు. వేరొకయంశతో నీ ‘నీలాద్రియ’ని జగద్వఖ్యాతి గన్న పురుషోత్తమక్షేత్రమున భూలోకమున విష్ణుప్రియుడవై ఎల్లప్పుడు వనసుందరీ సమేతుడవై చూచుటచేతనే ముక్తి నిచ్చుచూ నుందువు. నీకు జగత్ప్రసిద్దమగు కీర్తి రాగలదు. ఇటుల నీలుడు రత్నాదులతో పాటు అనేక వరములనుపొంది ఐహిక భోగములను అనుభవించి మహాయోగియై హనుమత్సేవకుడయ్యేను.
ఇతి హనుమద్వ్రతకథాయాం నీలచరిత్రకథనం నామ చతుర్థోధ్యాయః
Be First to Comment