మార్గశిర మాసమున శుద్దత్రయోదశి హనుమద్వ్రతము.
మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.
మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జనకాత్మజా – మహావీరేణ ధీమతా ||
అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. ఈరోజు హనుమంతుని పూజించినవాని కోరికలు తీరి దుఃఖనివృత్తి అగునని సీతమ్మతల్లి వరమొసగినది.
వ్రత విధానము
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యథోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.
హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.
వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.
శ్రీ హనుమద్వ్రత కధలు
తృతీయ అధ్యాయము
శ్రీ పరాశర మహర్షి చెప్పుచున్నాడు. ఓ మైత్రేయ మహాముని ఈ విషయంలో అద్భుతమగు ఒక పూర్వ వృత్తాంతమును చెప్పెదను వినుము. విభీషణుని కుమారుడు నీలుడనువాడు మహాబలవంతుడున్ను, అన్ని విద్యలను నేర్చినవాడు, నిత్యము ధర్మకార్యములందుండువాడు. నీలుడొకనాడు శత్రునాశకుడగు విభీషణుని చూచి ఇట్లు పల్కెను. ఓ ప్రభూ! ఈ లంకాపట్టణమున సంపద పూర్ణముగా నున్నది. మీ యధీనమునందున్న యీ లంకారాజ్యము ధనధాన్య సమృద్దమై అన్ని భోగములతో కూడియున్నది. ఎనలేని ముత్యములు మున్నగువానితోను, సువర్ణాదికముతోను నీపట్టణము, రాజ్యమంతయుగూడ సుఖసంపదలతో నున్నది. అయినప్పటికీ లంకాపట్టణమునగాని, రాష్ట్రమందుకాని, తమ రాజగృహమందుగాని, చింతామణి, కామధేనువు,కల్పవృక్షం మాత్రము కన్పించుటలేదు. న ద్వ్రతనిష్టా గరిష్ఠుడా! నీవు సాక్షాత్తు జానకీపతియగు శ్రీరామచంద్రుని పాదసేవచే గొప్ప సంపదను పొంది మహారాజువైతివి.
చింతామణి మొదలగు భోగములను నీ వెందులకు పొందలేదు? నా కాజ్ఞనిచ్చినయెడల ఆ మూడింటిని తీసికొనిరాగలను. విభీషణుడు పల్కెను. ఓ కుమారా! నీల! శ్రీరామచంద్రుని పాదమనెడు పద్మమునందలి తేనెకై నా మనస్సు తుమ్మెదగానై తిరుగుచుండును. ఆతని యనుగ్రహముచే బ్రహ్మానంద మను సముద్రమున మునిగియున్నాను. ఆ శ్రీరాముని యనుగ్రహముచేతనే నాకు నాశముకాని గొప్ప ఐశ్వర్యము లభించినది. అంతియకాక దీర్ఘాయువు, దేవతలకైన సాధ్యముకాని సామ్రాజ్యము లభించినవి. నా కా రాముడే చింతామణి , అతడే కల్పతరువు. కామధేనువు కూడ. ఒక్కయంశవలన నాచే నక్షయమగు మహైశ్వర్యము పొందబడినది. ఒక్క అంశచే వైకుంఠమునందు హరికి చరణదాసుడనుకూడ నైతిని. శ్రీ జానకీపతి దయవలన దేవేంద్రాది దిక్పాలు రందరు నాకు వశులై యున్నారు. ఇక భూలోక వాసులగు మానవులగూర్చి చెప్పనేల? ఇక నల్ప ప్రయోజనముకల చింతామణ్యాదులతో నా కేమి కలదు? పుత్రకా! నీల! అని ధర్మపరాయణుడగు విభీషణుడు నీలునితో ననెను.
పిమ్మట పుత్రునకు కీర్తి రావలెనని యోచించినవాడై మరల పల్కెను. దేవలోకమున చింతామణి, కల్పతరువు, కామధేనువు, ఎల్లప్పుడు దేవతలచేతనే యనుభవింపబడుచున్నవి. ఆ దివ్యరత్నజాతము గురుశుశ్రూష చేయక, దేవతల నుపాసించక అనుభవించుట కీ భూలోకమున శక్యముకాదు. కుమారా! దివ్యరత్నములయెడ నీకు కోరికయున్నయెడల గురుశుశ్రూష చేయుము. అతడె నీకు శ్రేయము లీయగలడు. ఈరీతిగా పుత్రుడగు నీలుడు మహాత్ముడగు విభీషణునచే జెప్పబడినవాడై ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి గురువగు శుక్రాచార్యుని సేవింప నాదరముతో నేగెను. పాదములొత్తుట వంటివానిచేతను, ప్రకాశమానములగు రత్నాదుల నర్పించుటచేతను పది పండ్రెండేండ్లు శుక్రాచార్యుని సంతోషపెట్టెను.
సేవకు సంతోషించినవాడై తపోనిధియగు భార్గవు డొకప్పుడు నీలుని నీకోరిక యేమియో చెప్పుమని యా మహానుభావుడడిగెను. అతడుకూడ అద్భుతమగు తన కోర్కెను విన్నవించెను. అందుకు ప్రీతుడై రాక్షసజాతివాడగు నీలునితో భార్గవు డిట్లు చెప్పెను. అన్నివిద్యలకు మహారాణి యనదగినది, వెంటనే సిద్దించునట్టి విద్యను, శ్రేష్థమగు వ్రతమును ఉపదేశించుచున్నాను. వానిచేత నీకు దివ్యరత్నములు ప్రాప్తించును. మరియి దేవేంద్రాదులకైన జయింప నలవికాని, చంపశక్యముకాని, శ్రేష్థములగు దీర్ఘాయువును నగును. నీకీర్తి స్థిరమై జగత్తున నిలవగలదు. రేపు నక్షత్రము మృగశీర్షనక్షత్ర మీ విద్యకు యోగ్యమైనది. కావున శ్రీరామునకు దూతయగు పంచవక్త్ర హనుమంతునకు సంబంధించిన వ్రతము సమస్త ప్రయోజనముల నొసగునది, వెంటనే సిద్దించునదికూడ కాన నాచరింపుమని ఆంజనేయ మంత్రము నుపదేశించెను. పరమశోభనమగు హనుమద్వ్రతముగూడ చేయించెను. నీలుడు వ్రతాంతమున గురుడగు బార్గవుని రత్నధనాదులతో నుచితరీతిని బూజించి యాతడొసగిన మహావిద్యను జపించుచుండెను. ఇట్లు జపించినంతట శ్రీరామచంద్రుని దాసులలో ప్రముఖుడగు హనుమంతుడు ముప్పదిమూడు కోట్ల యర్బుదముల సేవకాగణముతో (అర్బుదమనగా వేయికోట్లు) ప్రత్యక్షమయ్యెను. అట్లు ప్రత్యక్షమైన యా హనుమనుచూచి వెంటనే లేచి ఎదురుగ నున్నవాడై దోసిలొగ్గి యానీలుడు వాయుసుతుడగు నా పరాత్పరు నాంజనేయుని ధర్మాత్ముడై స్తోత్రముజేసెను.
అటుపిమ్మట నీలునిచే చేయబడిన భక్తిపూర్ణమగు స్తోత్రముచే సంతసించినవాడై వాయునందను డగు హనుమంతు డిట్లనెను. ఓ నీల! నీవు నా భక్తులందరిలోను ఎల్లప్పుడు నగ్రగణ్యుడగువాడ వైతివి. ఓ బుద్దిమంతుడా! నీతండ్రియగు విభీషణుడుకూడ నాకు మిత్రుడే. నీకొర్కె నెరిగితిని తప్పక దాని నీయగలను. రేపు అమరావతి కేగి ఇంద్రుని జయించి ఇంకనూ దేవతాస్త్రీలలో రత్నమువంటి, అందము, శీలము యుక్తవయస్సు సౌభాగ్యము కల వనసుందరినికూడ పొందగలవు. ఇంకనూ దేవతాస్త్రీలలో రత్నమువంటి, అందము, శీలము యుక్తవయస్సు సౌభాగ్యము కల వనసుందరినికూడ పొందగలవు.
విజ్ఞుడా! ఆ వెనుక పితామహుడగు బ్రహ్మదేవుడుకూడా నీ సమీపమునకు వచ్చి నీవు కోరకున్నను వరము నీయగలడు. ఎవడైతే లోకమున నామంత్రమును జపించి నావ్రతము నాచరించునో అట్టివాడు నీవలె వెంటనే ఫలితమును పొందును. నీపేరుమీద ఈచోటికి పురుషోత్తమక్షేత్రమని కీర్తి కల్గును. నీకు మృగశీర్షా నక్షత్రము నిలయము కాగలదు. బుద్దిమంతుడా నీకు నా దక్షిణాభాగమున స్థితి యేర్పడును. నా యనుగ్రహముచే నీ కన్ని గొప్ప గొప్ప కోర్కెలు నెరవేరగలవు. భగవంతుడు దేవదేవుడు శ్రీరామునకు ప్రియసేవకుడునగు హనుమంతుడు పైరీతిగా బల్కి కోర్కెలనిడు నాతడు రుద్రగణములతోను దేవర్షులతోను అంతర్థానమొందెను. సకలాభీష్టముల నందిన విభీషణుసుతుడు శ్రీమంతుడగు నీలుడు గురు శుక్రాచార్యుని పాదములకు మరలమరల ప్రణమిల్లి లంకకు వచ్చి వినయముతో తల్లితండ్రులకు నమస్కరించెను. సుఖముగా జీవించుచుండెను.
ఇతి శ్రీ హనుమద్ వ్రతకథాయాం నీలచరిత్రకథనం నామ తృతీయోధ్యాయః
Be First to Comment