Press "Enter" to skip to content

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు – 29th May, 2019 – బుధవారము

Sindhura Hanuman

 

ఆత్మీయ బంధువులారా!

ఈ సంవత్సరము 29th May, 2019 బుధవారము నాడు శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా, హనుమత్ భక్తులందరికీ, జయహనుమాన్ జీ website వీక్షకులందరికీ శుభాకాంక్షలు.

హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమునందు,వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

శ్రీపరాశర సంహిత 6వ పటలమునందు హనుమజ్జన్మ కథనం వివరింపబడినది.

వైశాఖేమాసి కృష్ణాయాం- దశమీ మందసంయుతా
పూర్వప్రోష్టపదా యుక్తా – తథా వైధృతిసంయుతా ||
తస్యాం మధ్యాహ్నవేళాయాం – జనయామాస వై సుతమ్
మహాబలం మహాసత్వం – విష్ణుభక్తి పరాయణమ్ ||

వైశాఖమాసమున కృష్ణపక్షమున దశమీతిథి శనివారము కాగా పూర్వాభాద్రా నక్షత్రము, వైధృతీయోగముకలనాటి మధ్యాహ్నసమయమున అంజన పుత్రుని కనెను. అతడు మహాబల సంపన్నుడు. మిక్కిలి శక్తి, విష్ణుభక్తి కలవాడు.

वैशाखे मासि कृष्णायां दशमीमंदसंयुता
पूर्वप्रोष्ठपदायुक्ता कथावैधृतिसंयुता।।
तस्यां मध्यान्हवेलायां जनयामास वै सुतम्
महाबलं महासत्त्वं विष्णुभक्तिपरायणम्।।

On the 10th day in the waning-moon fortnight (Kŗşņapakşa) of the Vaiśākha (2nd lunar) month, that was a Saturday (Śanivāsara) in Pūrva Bhādrapadā star constellation with the auspicious Vaidhŗrutiyōga alignment (the Yoga star of the 27th lunar mansion). In the afternoon, Añjana gave birth to the son. He is mightily built, very powerful and an ardent devotee of Vişņu.

హనుమజ్జన్మ స్థలం
హనుమంతుడు తిరుపతి కొండపై పుట్టాడు. తల్లి అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కనుటవలన అది అంజనాద్రి అయినది. పురాణాలలో ఇది పరిశోధించి నిరూపించబడినది. అక్కడే జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయంభూమూర్తిగా వెలిశాడు. పాపనాశనం వెళ్ళే మార్గంలో ఆకాశగంగకు ముందే జాబాలికి కొద్ది మాత్రపు నడకతో ఆక్షేత్రము దర్శించవచ్చు. తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక దర్శింపదగినది.

మంగళవార విశిష్టత – సింధూర ప్రియుడు
ఒక మంగళవారమున ఆకలిగొన్న హనుమంతుడు సీతమ్మతల్లి నేమయిన పెట్టమని ప్రార్థించి నిరీక్షించుచుండెను. అమె స్నానము చేసి వచ్చి తిలకధారణ మొనర్చుకొని పాపిట సింధూరము నుంచుకొనెను. హనుమంతు డా సింధూరమెందుకని ప్రశ్నింప నామె దీనివలన నా స్వామికి ఆయుర్వృద్ది యగునని యనగా హనుమంతుడు వెంటనే వెడలి యొడలంతా సింధూరము నలదుకొని సభకు వచ్చెను. అతనిని చూచి సభ్యులందరూ విరుగబడి నవ్విరి. కారణమడిగిన రామునకు ‘మీ కత్యంతము ఆయుర్వృద్ధి కలుగవలెనని యొడలంతట పూసుకొంటి’ ననగా యదార్థ విషయమెరిగి హనుమంతుని సరళభావమునకు ముగ్ధుడై ‘నేడు మంగళవారము. కాన మంగళవారమునాడు నాకు అనన్య ప్రీతిపాత్రుడగు హనుమంతున కెవ్వరు తైలము, సింధూరమ పూయుదురో వారికి నేను ప్రసన్నుడనై వారి కోరికలు తీర్చెదను’ అని ప్రకటించెను. కాన హనుమంతునకు సింధూరము పూయుట విశేషము. హనుమదుపాసనా కల్పద్రుమంలో ఆపన్నివారణార్థం హనుమంతునకు తైలాభిషేకము కర్తవ్యముగా చెప్పబడినది. అందుకే తైలమిశ్రిత సింధూరలేపనము ముఖ్యముగా చెప్పబడినది.

కాన మంగళవారమున హనుమంతునకు అభిషేకము, సింధూరతైల లేపనము మొనర్చి, అరటిపండు నైవేద్య మిడువారికి హనుమదనుగ్రహముతో పాటు సీతారాముల అనుగ్రహము కూడా తప్పక లభించును.

ఆ హనుమంతుని ఆశీర్వాదములు మన అందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…

జయ హనుమాన్| జయ జయ హనుమాన్ ||

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: