(గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రిగారు “సంపూర్ణ హనుమచ్చరితం” అనే శీర్షికతో ఆంజనేయస్వామి సంపూర్ణ జీవితచరిత్రను హనుమద్భుక్తులమయిన మనందరి కొరకు ధారావాహికగా అందజేస్తునారని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఎన్నో అతి ముఖ్యమైన విషయములు ఇందులో పొందుపరచబడనున్నవి. పాఠకులు అందరూ తాము చదువుతూ, తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చదివించగలరని, తమ అమూల్య అభిప్రాయాలను తెలియజేయగలరని అశిస్తూ – రమేష్ చంద్ర అడివి)
సంపూర్ణ హనుమచ్చరితం – నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం హనుమంతుడు – ప్రథమ భాగము (1)
‘ధర్మ ఏవ హతో హన్తి’ అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటి పరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతోందో అన్ని విధాలా మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశానికీ సరైన పరిష్కారం ఎవ్వరికీ కానరావటంలేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈవినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరొకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటాని కొకమంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే ఆతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆచిరంజీవిని ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకో గల్గుతాం.
త్రేతాయుగంలో రావణాదులను వధించి ధర్మాన్ని రక్షించటంకోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మకార్యపూర్తి హనుమంతుడి సహకారంవల్లనే జరిగింది. ధర్మకార్యంకోసం మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. రామసేవకు డయితే రాముడు పుట్టిననాటినుండీ ఆతనిసేవలో ఉండాలి. అలాకాక రాముడి ధర్మకార్యం ఆరంభమయినప్పటినుండి మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, ఆంజనేయుడికీ పరిచయం కిష్కింధాకాండదాకా జరగలేదు. అలాగే ధర్మకార్యం పూర్తికాగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తుల ననుగ్రహిస్తూ ఉన్నాడు తప్ప రామునితో రాజభోగాలలో గడుపలేదు. అంతేకాదు ధర్మంకోసం ఆరామునకు కూడా ఎదురునిల్చాడు. అదే రామాంజనేయయుద్ధగాధ. కాబట్టి ధర్మంకంటె ఎవ్వరూ ఎక్కువ కారనే అద్భుత ఆదర్శం హనుమంతుడిలో చూడగల్గుతాం. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడునిలిచాడు. అలా త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్ర వహించినవాడు హనుమంతుడు. రామరావణయుధ్ధమనే ధర్మయుధ్ధంలో విజయకారకుడు హనుమంతుడు.
ద్వాపరయుగంలో ధర్మాధర్మాలమధ్య జరిగిన యుధ్ధం కురుక్షేత్రసంగ్రామం. అందులో ధర్మం విజయం సాధించింది. అటువంటి ద్వాపరయుగ ధర్మవిజయంలో కూడా హనుమంతుడిది కీలకపాత్రే. కాకుంటే త్రేతాయుగంలో ధర్మవిజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా, ద్వాపరయుగ ధర్మవిజయానికి పరోక్షంగా కారకుడయాడు. కురుక్షేత్రసంగ్రామవిజయం భీమార్జునులభుజస్కంధాలమీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురినీ బలపరీక్షపెట్టి, ధర్మరక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడయినవాడు హనుమంతుడు. విజయుడికి వరమిచ్చిన ప్రకారం అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి కూడా ఓటమి నంగీకరించి అర్జునుడి రథంటెక్కెంమీద ఉండి ధర్మవిజయకారకుడయ్యాడు హనుమంతుడు. సౌగంధికకుసుమాన్ని, పురుషమృగాన్ని తేవటంలో భీముడిని పరీక్షించి అనుగ్రహించి విజయవరం ఇచ్చినవాడు హనుమంతుడు.
‘కపిలధ్వజప్రభల ఆంధీభూతులన్ జేయవే’ అని తిక్కన అన్నట్లు కౌరవసేన కళ్ళు హనుమంతుని తేజఃప్రభలతో బైర్లుకమ్మి యుధ్ధం చేయటంలో అశక్తమయయింది. హనుమంతుడు టెక్కెంమీద ఉన్నందువల్లనే శత్రుపక్షపు భయంకరఆగ్నేయాస్త్రాదులవల్ల రథం ధగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణు డర్జునిడికి నిరూపించాడు. అలా ద్వాపరయుగంలోనూ ధర్మవిజయానికి కారకుడు హనుమంతుడు.
కలియుగంలో విదేశీయులవిధర్మీయులవలన ధర్మం సంకట పరిస్థితికి లోనయింది. ధర్మాన్ని సంరక్షించి హిందూసామ్రాజ్య పట్టభిషిక్తుడయినవాడు ఛత్రపతి శివాజీ. ఆతడిగురువయిన సమర్థరామదాసే అటువంటి విజయానికి ప్రధానకారణం. సమర్థరామదాసు హనుమదవతారంగానే చెప్తారు. సమర్థుడు హనుమంతుడినే సమాజంముందు ఆదర్శంగా నిల్పి వ్యాయామం, సాముగరిడీలు, యుధ్ధతంత్రాలూ, ఆయుధప్రయోగాలూ నేర్పి విజయాన్ని సాధించాడు. అలా కలియుగంలో ధర్మవిజయం హనుమదనుగ్రహంవల్లనే చేకూరినట్లు చరిత్ర చెప్తోంది.
కాబట్టి ఇతిహాసపురాణాలు, చారిత్రకసత్యాల్య ధర్మరక్షణలో ఒకే ఒక్క దిక్కు హనుమంతుడినిగా చెప్తున్నాయి. సకలసద్గుణగరిష్టుడు, సర్వశక్తిసముపేతుడు అయిన హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించనప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యమై, నేటి ఘోరవిపత్కర పరిస్థితులనుండి బయటపడుతుంది. (తరువాయి భాగంలో మరికొంత…)
[This article is © Copyright of Jayahanumanji.com by Dr Annadanam Chidambara Sastry. All rights reserved. No part of this may be copied or changed in any format or used in any other manner under any circumstances without the written permission of the author. Violators would be prosecuted severely.]
జై హనుమాన ; జై జై హనుమాన !
అభినన్దనలు
జై హనుమాన !