ఏ కర్మనాచరించాలన్నా ముందుగా సంకల్పం చెప్పుకొనాలి. అది మన, దేశ, కాల ఋషి, విశేషాలన్నిటినీ సూచిస్తుంది. అలా చెప్పుకొనటంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిత్య, నైమిత్తిక, సామాన్య కర్మలందు సంకల్పం చేస్తాము. మహాదానాదులందు యజ్ఞాదులు, కన్యాదాన, మహానది స్నానములందు మాత్రం మహాసంకల్పం చేయాలి. అలా దేవస్మృత్యాదులన్నీ చెప్తున్నాయి. ఈ మన మంచి సంప్రదాయాన్నే స్థిరంగా ప్రామాణికంగా ఉండవలసిన రిజిస్ట్రేషను వంటి వానిలో పాటించడం నేడూ గమనిస్తాం.
సంకల్పంలో చెప్పే ‘అద్యబ్రహ్మణః’ అంటే ఇప్పటి పద్మోద్భవుడను బ్రహ్మ యొక్క ‘ద్వితీయపరార్థంలో’ అంటే రెండవ యేబది సంవత్సరముల ఆరంభకాలములో ఉన్నాయి అని అర్థం. అది బ్రహ్మమానంతో లెక్కచూడాలి. నాల్గువేల యుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి.
ఇక సంకల్ప విషయంలో ‘శ్వేతవరాహ కల్పే’ అంటాము. పార్థివకల్ప, అనంతకల్ప, కూర్మకల్ప, బ్రహ్మకల్ప, వరాహకల్ప, శ్వేతవరాహకల్ప, ప్రళయకల్ప, పాద్మకల్ప, సావిత్ర్యాది కల్పాలలో ఒకటైన శ్వేతవరాహకల్పంలో మనం ఉన్నాము.
‘వైవస్వత మన్వంతరే’ అన్నదానికి స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామసాది పదునాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరములో మనం ఉన్నాము.
‘కలియుగే ప్రథమపాదే’ అనగా పై కల్పపు 28వ మహాయుగములోని కలియుగపు 432000 సంవత్సరాలలో మొదటిపాదంలోనే ఉన్నాము.
‘జంబూద్వీపే’ – ‘సప్తద్వీపా వసుంధరా’ అని భూమండలమున జంబు, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కరములనే ఏడు ద్వీపాలున్నాయి. వానిలోని జంబూద్వీపంలో మనం ఉన్నాము. ‘జంబూ ద్వీపః సమస్తానా మేతేషాం మధ్య సంస్థితః’ అని బ్రహ్మపురాణం చెన్ప్తోంది.
‘భారతవర్షే’ – భారత, కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హైరణ్యక, కురు, భద్రాశ్వ, కేతమూలములనే నవవర్షాలలో తొలి భారతవర్షంలో మరల ఇంద్ర, కశేరు, తామ్ర, నాగ, గభస్తి, సౌమ్య, గాంధర్వ, చారణ, భారతమనే తొమ్మిది వర్షవిభాగాలున్నాయి. ఇట్టిద మన భారత వర్షం.
‘గాయంతి దేవాః కిల గీతకాని- ధన్యాస్తు యే భారతభూమి భాగే, స్వర్గాపవర్గాస్పద హేతుభూతే – భవంతి భూయః పురుషా మనుష్యాః’ అని దేవతలు ‘ఈ భారతభూమి’లో ఉన్న ప్రజలు ధన్యులని; వీరు స్వర్గము, ముక్తివంటివన్నీ పొందటానికి కావలసిన కర్మలన్నీ ఆచరించుకొన గల్గుతారని పొగడుతూ ఉంటారట. కానీ, ఈ భారతభూమిని వదిలి పోదామనుకొనేవారియొక్క, ఇక్కడ పుట్టికూడా సత్కర్మలాచరింప నోచుకోని వారియొక్క దురదృష్టాన్ని ఏమనాలి?
‘భరతఖండే’ – ఈ భూమి నవఖండ మండితం. భరత, ఇంద్ర, కురు, గభస్తి, నాగ, తామ్ర, వారుణ, సౌమ్య, గంధర్వ అనే నవఖండాలలో భరతఖండం మనది.
‘మేరోః దక్షిణ దిగ్భాగే’ – మేరు పర్వతానికి దక్షిణభాగంలోనే భారత, కింపురుష, హరి వర్షాలున్నాయి. మేరు పర్వతం ఉత్తరధృవ ప్రాంతం. హైందవార్యులు మొదట అక్కడి వారు. వేదాలకాలం ఎక్కువ అక్కడే జరిగింది. కాలక్రమంలో ఆ ప్రాంతమంతా ఉష్ణోగ్ర నశించడంతో మనవారు మేరువుకు దక్షిణ దిశకు వచ్చినారు. మేరు పర్వతం దేవతల నివాసంగా చెప్పబడింది. అందువల్ల అది లక్ష్యమైంది. కాబట్టి ‘మేరోః దక్షిణ దిగ్భాగే’ అని చెప్పుకుంటాము. శ్రీశైలం మనకు లక్ష్య క్షేత్రంగా స్వీకరించబడింది. కాబట్టి దానికి ఆ సమయంలో ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు ‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే’ అన్నట్లుగా చెప్పుకొనాలి. పవత్రనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేర్యాది నదులు ఏ రెంటి మధ్యన ఉన్నామో అది అనగా ‘కృష్ణాకావేర్యోః మధ్యదేశే’ అన్నట్లుగా చెప్పుకొనాలి. ఇక స్వవిషయములు చెప్పి ఆ సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిథి, వారాదులు క్రమంగా చెప్పాలి. అనంతరం గోత్రం చెప్పుకొనాలి.
Be First to Comment