భూత, ప్రేత, పిశాచాది బాధలు తొలగుటకు, రోగములు, ఎట్టి కష్టములైన తొలగుటకు, అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు సుప్రసిధ్దములు. అనేకులు ఆ ప్రదక్షిణములవలన కృతకృత్యులగుచున్నారు. ప్రదక్షిణములకు నియమములు ముఖ్యములు. దేవాలయమునందుకాని, లేదా హనుమంతుని యంత్రమును చేయించుకొని దాని చుట్టూ ఇంటివద్దనైనా ప్రదక్షిణములు చేయవచ్చును. గణనమునకై పసుపుకొమ్ములే వాడుట శ్రేయము. మిరియములు ఉగ్రవిషయములు కాన పసుపుకొమ్ములే వాడుట మంచిది. పుష్పాదికమును, వక్కలను లెక్కకు తీసికొనవచ్చును.
పఠించు శ్లోకములుః
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్
ఆంజనేయం మహావీరం – బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభం శాంతం – రామదూతం నమా మ్యహమ్ ||
మర్కటేశ మహోత్సాహ – సర్వశోక వినాశన
శత్రూ న్సంహర మాం రక్ష – శ్రియం దాపయే మే ప్రభో ||
అని పఠించుచు ప్రదక్షిణములు చేయవలెను. భక్తి శ్రధ్ధలతో చేతులు జోడించుకొని గణనమున కుపకరించు పుష్పాదికమును చేతియం దుంచుకొని వినమ్రులై పరుగులిడక ప్రదక్షిణములు చేయవలెను. మధ్యలో మాటాడరాదు. స్నానాదికము నిర్వహించి శుచులై చేయవలెను. నూట ఎనిమిది కాని, శక్తి లేని వారందు సగము కాని, ఇంకను శక్తిహీను లందు సగమైన చేయవచ్చును. అట్లు శక్తి ననుసరించి నలుబదిఐదు దినములుగాని, ఇరువదియొక్క దినములుకాని, అభీష్టము ప్రబలమగుచో బహుదినములు, బహునియమములు తప్పక పాటింపనగును. అభీష్టమల్పమగుచో కొద్దికాలము చేయవచ్చును. అభీష్టము కలవారు స్వయముగా ప్రదక్షిణములు చేయనగును. వా రశక్తులైనచో తమకొరకై అన్యులచేతనయినా చేయింపవచ్చును. ప్రదక్షిణములు చేయుట ఇంటి యందైనచో దీపారాధన చేసికొని చేయవలెను. దేవాలయమందైన దీపారాధన చేసికొని లేదా దేవునికడ నున్న దీపారాధనయందు తైలము వేసి నమస్కరించుకొని ఆరంభించనగును. నిత్యము శిరస్నానము కర్తవ్యము.
ప్రదక్షిణములు పూర్తియైన పిదప “మయాకృతై రేభిః ప్రదక్షిణైః శ్రీసువర్చలాసమేత హనుమాన్ సుప్రీత స్సుప్రసన్నో వరదో భూత్వా మమాభీష్టసిద్దిం దదాతు” అని జలమును విడువవలెను.
దేవాలయమునందు చేయనివారు స్వామి యంత్రమును అశ్వత్థమూలమునకాని, కదళీమూలమునకాని, ఉసిరి లేదా తులసి చెట్టు మొదటనయినాకాని, లేక తమ ఇంట పరిశుధ్ద ప్రదేశమునకాని యంత్రము నుంచి ప్రదక్షిణము చేయనగును. ప్రదక్షిణములు చేయు కాలమున బ్రహ్మచర్యము, నేలపడక, నిత్యము దేవపూజ, మౌనవ్రతం, ఒంటిపూట భోజనము, కోపము వీడుత, దైవము యెడ అచంచల భక్తి యున్నగునవి ముఖ్య నియమములు. ఇంద్రియ వికారముల కవకాశమీయక మృదువైనవి, కొద్దిమాత్రము వేడికలవి, బాగుగా వండినవి యగు సాత్విక పదార్థములను లఘువుగా భుజింపనగును. భక్తిలోపము తగదు. శక్తివంచన కూడదు. అశక్తులు యధాశక్తి నియమములు పాటించి స్వామి యనుగ్రహమునకు పాత్రులు గావచ్చును. దక్షిణాభిముఖుడైన హనుంతుడు శక్తిమంతుడుగా పెద్దలు చెప్పుదురు. అట్టి స్వామి నారాధించి నిర్వహించుట సద్యఃఫల మీయవచ్చు.
(Source: శ్రీ హనుమద్విషయ సర్వస్వము – హనుమద్భుక్తులకు, దీక్షాపరులకు నిత్యపారాయణ గ్రంధము. గ్రంధకర్తః డా. అన్నదానం చిదంబరశాస్త్రి)
నకు హన్మన్ యోక వివహమ్ కోరకు తేలుసుకోవలని ఉ౦ధి
పరసర సమ్హిత చదవ గలరు