ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
9th Aug, 2012 నాడు శ్రావణ బహుళ అష్టమి. దీనినే ‘కృష్ణాష్టమి’ అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈరోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాసలీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పటికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెళ్ళలేదు.
భూభారం తగ్గించటానికి పుట్టిన ఆయన, రాజుల రూపంలో ఉన్న రాక్షసులను తానే వెదకి చంపే పని పెట్టుకోక జరాసంధుని ద్వారా అందరినీ తన ముందుకు రప్పించుకొని సంహరించాదు. లోకం కోసం భగవద్గీతను బోధించి జగద్గురువు అయ్యాడు. ‘శ్రీకృష్ణ పరమాత్మా’ అని పరమాత్మ వాచకంతో ఆయననే కొలుస్తాం. దీనిని బట్టే ఆయన స్ఠానం గ్రహించాలి. ఆయన చేసినవన్నీ అధర్మాలుగా కనిపించే ధర్మ సూక్ష్మాలు.
ఈనాడు కృష్ణాష్టమీ వ్రతం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ కృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడలు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. శ్రీ కృష్ణుని లీలకు చిహ్నంగా ఉట్టి కొట్టడం వంటి వేడుకలు నిర్వహిస్తారు.
శ్రీకృష్ణ శరణం మమ. శుభం భూయాత్.
పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te