ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ది:02-08-2012 నాడు శ్రావణ పౌర్ణమి. దీనినే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని తీసివేస్తారు. ఆ సంవత్సరమే ఉపనయనం అయిన నూతన వటువునకు ఈ రోజు ‘ముంజ విడుపు’ లేదా ‘ఉపాకర్మ’ కార్యక్రమం నిర్వహిస్తారు.
సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈనాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతినిచ్చి, వారి కుడి చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండివంటలు పెట్టి తృప్తి పరుస్తుంది. సోదరుడు తన సోదరిని, ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణకు ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ.
ఈ రక్షను మిత్రులు కూడా పరస్పరం కట్టుకొనవచ్చును. రక్ష కట్టుకునేటప్పుడు
“యేన బద్ధో బలీ రాజా – దానవేంద్రో మహాబలః
తేనత్వాం అభి బధ్నామి – రక్షే మాచల మాచల” అని చదవాలి.
ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే. మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతటి వాడైనా ధర్మం కోసం దారపు పోగుకి కూదా జీవితాంతం కట్టుబడి ఉంటాడనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది. శుభం భూయాత్.
Be First to Comment