ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొంటే, వరలక్ష్మి వరములు ప్రసాదింపగలదని, ధన, కనక, వస్తు, వాహనాదులు లోటులేకుండా అనుగ్రహింపగలదని ప్రతీతి. సువాసినులు, అంటే ముత్తయిదువులు అందరూ ఈవ్రతం చేస్తారు. దీనిద్వారా సౌభాగ్యం పొందగలుగుతారు. దీనిని ప్రత్యేకంగావున్న కల్పమును అనుసరించి నిర్వహించుకొనాలి.
స్త్రీలకు ప్రధానమైన ఈ మాసంలోనే శుక్రవారాలన్నిట లక్ష్మీ కటాక్షం కోసం “శుక్రవారం వ్రతం” ఆచరించాలి. వివాహము అయిన బాలికలు శ్రావణ మంగళవారములందు “మంగళగౌరి వ్రతము” చేస్తారు. ఇది 5 ఏళ్ళు జరపాలి. అలా జరపటం వలన జన్మజన్మలా, ఆ మంగళగౌరి అనుగ్రహంచి, అమంగళములు కలుగక సౌభాగ్యవతులుగా జీవిస్తారు. తన మంగళసూత్రాల గట్టిదనంపై నమ్మకంతో భర్త అయిన శివుని విషం మ్రింగటానికి కూడా అనుమతించిన సుమంగళి ‘మంగళగౌరి వ్రతము’ స్త్రీల సౌమంగళ్యానికి అవసరము.
శ్రావణమాసం వర్షాకాలం. నిరంతరం నీళ్ళలో పనులు చేయవలసిన ఆడువారికి కాళ్లు పాచిపోయే ప్రమాదం వుంది. ఈ మాసం అంతా నోములరూపంలో ఇంటింటా కాళ్ళకి పసుపురాయడంవల్ల స్తీలు ఆ అనారోగ్యాలకి లోనుకారు.
శ్రావణమాసపు పేరంటాలద్వారా స్త్రీలు అంతా సమావేశం అయ్యే అవకాశం వుంది. అప్పుడు అందరూ కలిసి మంచి ఆలోచనలు చేయడం, మంచి నిర్ణయాలు తీసికొనడం సమాజానికి మంచిది. వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు. శుభం భూయాత్.
Be First to Comment