శ్రీరామ
జయ హనుమాన్
(May 15, 2012 న శ్రీ హనుమజ్జయంతి సందర్భమున)
శ్రీ హనుమజ్జననం
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.
హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.
విద్యాభ్యాసము
శ్రీ హనుమంతుని గురువు సూర్యుడు. పూర్వపశ్చిమ పర్వతములు రెంటిపై రెండుపాదము లుంచి వేద వేదాంగములు, సకల శాస్త్రములు నేర్చెను. హనుమంతుడు నవవ్యాకరణవేత్త. అతనికి తెలియని విద్య లేదు.
నివాసము
మేరుపర్వతమున నైరుతి దిక్కున గంధమాదనపర్వతము కలదు. ఆ పర్వతముపై వివిధ పుష్ప ఫల పూర్ణమగు వృక్షములలో ఆనందదాయకమగు కదలీవనమున రామధ్యాన తత్పరుడై హనుమంతు డుండును.
చిరంజీవి
వాయుదేవుడు తన కుమారుడగు హనుమంతునిపై ఇంద్రుడు వజ్రాయుధము ప్రయోగించుటచే కోపించి లోకమంతట వాయువును ఉపసంహరించెను. లోకరక్షణార్థము బ్రహ్మాదులు వాయుదేవు ననునయపరచి హనుమంతునకు వివిధ వరము లిచ్చుచు దీర్ఘాయువును ప్రసాదించిరి. సంజీవపర్వతము తెచ్చి లక్ష్మణుని బ్రతికించినందుకు సంతసించిన శ్రీరాముడు హనుమంతుని చిరంజీవిగా నాశీర్వదించెను. చిరంజీవుల ధ్యానముకూడా అపమృత్యువును తొలగించునని ప్రాతఃస్మరణ చెప్పుచున్నది.
నామమహిమ
బుద్ది, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాఢ్యము, వాక్పటుత్వము మున్నగున వన్నియు హనుమన్నామ స్మరణవలన చేకూరును.
పవిత్రం హనుమన్నామ – ద్వాదశావృత్తి మాత్రతః
యే స్మరంతి జనా స్తేషాం – కార్యసిధ్ధి ర్భవేధ్ధృవమ్ ||
శుభాశుభములం దన్నిట పవిత్రమగు హనుమన్నామమును భక్తి తత్పరులై పండ్రెండుమార్లు తలచిన కార్యసిధ్ధి యగునని పరాశరమహాముని తెల్పెను. ప్రయాణాది సర్వకాల ధ్యాన మిదియే.
పాఠకులకు, హనుమద్భక్తులందరకు, శ్రీహనుమజ్జయంతి సందర్భముగా శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
thank you and wish you the same
Hello, I want to get in touch with you regarding Hindi translation. I talked with Mr Sastry on phone but could not communicate much since I don’t know Telugu and he could not follow my Hindi properly.
How can I get in touch with you?