Press "Enter" to skip to content

గోమాత విశిష్టత – 3

గోమాత

Cow

ఇలాగే యజుర్వేదం (23-48) లో ‘బ్రహ్మా సూర్యసమం జ్యోతిః’ మంత్రంలో ‘గోస్తు మాత్రా న విద్యతే’ అని గోవునకు సమమైనది లేదని తెలుపబడింది. ‘గాం సీమాహిం రదితం విరాజమ్’ అని గోహింసను నిషేధిస్తోంది. ‘అంతకాయ గోఘాతమ్’ అని గోహంతకులను హతమార్చ మనికూడా యజుర్వేదం చెప్పింది. గోవధ అంతటి పాపమని గ్రహించాలి. అంతేకాదు ‘క్షుధేయాగాం విక్రేతం తం భిక్షమాణ ఉదితిష్టాశినమ్’ ని వేదం గోహంతకుడు భిక్షకై వచ్చినా భిక్ష పెట్టవద్దని, వానికి మరణమే శిక్ష ని చెప్తోంది. అధర్వణ వేదంకూడా గోవునందు సకలదేవత లున్నవిషయం చెప్పింది. ‘ఏకో గౌ రేక’ (8-9-26) లో గోవు పరోపకారులందు మొదటిదిగా చెప్పబడింది. ‘చతుర్నమో’ (11-2-9) మంత్రంతో గొప్పదగు గోవును సృజించిన భగవంతునకు వందనము సమర్పింబడింది. 12-4-5 లో గోవు పవిత్రజంతువని, పూజింపదగినదని చెప్పబడింది. అధర్వణ వేదం ‘పచతేవశాన్’ (1-114-10) మంత్రంలో గోమాంసమును ఇంటియందుకానీ మరెచ్చటకానీ వండువాడు, తినువాడు భ్రష్టుడు కాగలడని చెప్పటమేకాక గోవులందు, క్రౌర్యం చూపవద్దని, కత్తివంటి మారణాయుధాలను గోవుకు దూరంగా ఉంచమని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్తున్నా పవిత్రగోవునుగూర్చి కువ్యాఖ్యలు చేయబడి భ్రాంతికారణాలుగా కొన్ని తయారయాయి. గోమాంస భక్షణం వెనుకటి మునులు చేశారని, వేదపురాణాలలో అటువంటి ప్రసంగాలున్నాయని అంటారు. గౌ శబ్దాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకొని చేసే విమర్శ అది. గౌ శబ్దానికి ఇంద్రియములనికూడా అని అర్థం. నేను గోవును తింటాను అంటే జితేంద్రియుడ నౌతాను అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. దురదృష్టవశాత్తు దాన్ని అర్థం చేసికొనక గోహత్యను సమర్థించేవారు దాన్ని వాడుకొంటున్నారు. గోశబ్దానికి ఆవు, ఎద్దు, సూర్యుడు, యజ్ఞం, వాక్కు, దిక్కు, భూమి, గుర్రం, స్వర్గం, ఉదకం, వెంట్రుక, బాణం, వజ్రం, ముని, నేత్రం, పగ్గం, అల్లెత్రాడు వంటి ఎన్నో అర్థాలు తెల్లనిఘంటువుల లోనే ఉన్నాయి. ఇంకా నిరుక్తపరంగా ఎన్ని అర్థాలున్నాయో అవన్నీ ఆలోచించకుండా ఆవుగానే భావించి అపార్థాలు రానీయరాదు. అపార్థాలతో కావ్యాలలో కూడా తద్దినాలకు దూడమాంసాలు పెట్టినట్లు, గోమాంసాలు పెట్టినట్లు వ్రాశారనే విమర్శలున్నాయి. అవన్నీ వేదమంత్రాల అపార్థాలతో వచ్చిన ప్రమాదాలే. సంప్రదాయాన్ని నాశనం చేయటానికి ఇరికించబడిన కృత్రిమ వాక్యాలను, అపార్థాలను, కవుల అతిశయోక్తుల విపరీతధోరణులను ప్రక్కన పెట్టకపోతే మన ధర్మాలన్నీ ప్రమాదంలో పడతాయి. వేదము లన్నిటియందే కాక తత్సంబంధమైన కఠ, మైత్రాయణీయ, తాండ్య, జైమినీయ, శతపధాది బ్రాహ్మణ గ్రంధాలలో గోశబ్దంయొక్క నానార్థ రహస్యాలు చెప్పబడినాయి.

గవోపనిషత్తులో ముల్లోకాలందు శ్రేష్ట, పవిత్ర వస్తువేది? అని సౌదాసు అడగటం వలన వసిష్టమహాముని గోరహస్యాల నెన్నో చెప్పాడు. గోవు దేహాన అనేక పరిమళాలు వ్యాపించి యున్నాయని, అది లక్ష్మికి మూలస్ఠానమని, దానికి సమర్పించిన దేదీ వ్యర్థం కాదని, అన్నము నిచ్చేది గోవే అని, యజ్ఞాలు గోవులపైనే అధారపడ్డాయి. యజ్ఞములన్నీ గోవునందే ప్రతిష్టితమై ఉన్నాయి. గోదానంచే సమస్తపాపాలు పోతాయి. కపిలగోవు నలంకరించి దూడతోను, పాల పాత్రతోను దానంచేస్తే ఇహపరలోక విజయం చేకూరుతుంది. నిద్రించు ముందు, నిద్రలేవగానే గోవును స్మరించి నమస్కరించటం గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది. గోమూత్ర, గోమయాలను నిందింపరాదు. గోమాంసం భక్షింపరాదు. గోమయం పూసుకొని స్నానం చేయటం, ఎండిన ఆవుపేడపై కూర్చొనటం, ఆవునేతితో హోమంచేయడం, నిత్యం పుష్టి, తుష్టినిచ్చేవి అంటూ ఎంతగానో చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో గోసేవద్వారా సత్యకాముడు విద్యాప్రాప్తినందినగాధ కన్పడుతుంది. జాబాల అనే ఆమె కుమారుడు సత్యకాముడు హరిద్రుమతుడనే గురువువద్దకు విద్యకైవెళ్ళాడు. గురువు శిష్యునకు గోవుల నప్పగించి శ్రద్ధగా వాని సేవ చేయమన్నాడు. అలాగే అని అడవికి తోలుకొనిపోయి సేవించుచుండగా అవి వేయిదాకఆభివృధ్దిచెందాయి. వానిలో ఒక వృషభంలో వాయు దేవుడు ప్రవేశించి ఇక గురువు ఇంటికి తోలుకెళ్ళమని చెప్పి వెళ్ళేత్రోవలో ఆ గోవునందు ప్రవేశించిన వాయు, బ్రహ్మ, సూర్యాదులు తలోపాదం జ్ఞానోపదేశం చేశారు. గురువు సత్యకామునియందలి బ్రహ్మ తేజస్సున కాశ్చర్యపడి గోసేవా ఫలాన్ని గ్రహించి గురుముఖతః బ్రహ్మజ్ఞానం పొందగోరిన సత్యకాముని గురువు అనుగ్రహించటం జరిగింది. కఠోపనిషత్తునందు వాజశ్రవసుడు వృద్ధగోవులను దానంచేస్తూ ఉంటాడు. అందువలన తండ్రికి పాపం రాగలదని భావించిన అతని కుమారుడు నచికేతుడు తండ్రిని అ పాపంనుండి మరలింపగోరి ‘తండ్రీ! నన్నెవరికిస్తావు?’ అని మరల మరల అడగటంతో తండ్రి ‘యమునికిస్తా’నని కోపంగా అన్నాడు. అమాటను సత్యంచేస్తూ నచికేతుడు యమసదనానికి వెళ్ళి యముడు లేకుండుటవలన మూడు రోజులు ఉపవాసదీక్షతో అక్కడున్నాడు. యముడు వచ్చి బ్రాహ్మణుడు అతిధ్యంలేక తనకై నిరీక్షించుట వలన తద్దోష పరిహారార్థం మూడువరాలు కోరుకోమన్నాడు. మొదటివరంగ తండ్రి శాంతచిత్తు డగుటను, రెండవవరంగా అగ్నిని గురించి, మూడవవరంగా మరణానంతరవస్థను గ్రహించి నచికేతుడు వెళ్ళాడు. (ఇంకా ఉంది…)

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

 

One Comment

  1. nageswararao karra nageswararao karra April 12, 2012

    hello indians
    manantha ekamai govu ni samrakshinchu kundam. tkshaname mana government parliament lo bill pravesapetti govadhanu nishedhinchali. meena meshalu lekka pett kunda ” govunu jatiya jantuvuga prakatinchali”. mana punya bhumini kapadukundamu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: