గోమాత
గోసంరక్షణ హిందూధర్మంలో ప్రధానాంశం. ‘మానవ వికాసక్రమంలో గోరక్షణ అన్నిటికన్నా మిన్నయైన అలౌకిక విషయంగా నాకు తోస్తున్నది’ అంటారు గాంధీజీ. మన సంప్రదాయం గోవుకు సమున్నతస్థాన మిచ్చింది. ఒకవిధంగా ఆలోచిస్తే గోవు ప్రతి పుణ్యకార్యానికి అవసరమే. గోవు మన సంప్రదాయంతో అవిభాజ్యసంబంధం కల్గి ఉంది. గోవును తీసేస్తే మన సంప్రదాయం లేనట్లే అని చెప్పాలి. శివుని వాహనమైన నంది గోసంతతి. అది లేని శివాలయం లేదు. గోక్షీరం లేనిదే శివాభిషేకం కాదు. విభూది నిర్మాణం ఆవుపేడతోనే చేయ్యాలి. కావున శైవసంప్రదాయాన గోవు అవిభాజ్యం. గోపాలబాలకృష్ణుడు లేని వైష్ణవము లేదుకదా! సంక్రాంతి పండుగరోజులు పంటలువచ్చిన సుఖప్రదమైన కాలం. గంగిరెద్దులను గౌరవిస్తూ మనం ఆసుఖాలకు నోచు కొంటాము. గోమయం లక్ష్మీస్థానం.