శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – గురువుగారూ! ఆంజనేయుడు పుట్టటంవరకూ సెలవిచ్చారు, ఆయనకున్న పేర్లన్నింటినీ వివరించారు, కానీ చాలా ఎక్కువగా వినిపించే హనుమంతుడు అనే పదాన్ని గూర్చే చెప్పలేదేమండి.
గురువుగారు – ఆ… ఆ హనుమంతుడు అనే పదం సాధారణమయిన పదంకాదు. అది చాలా గొప్పపదం. ఆ పదాన్ని ఉచ్ఛరించటం వల్లనే బుధ్ది, బలం, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యత్వము, అజాడ్యము, వాక్పటుత్వము కల్గుతాయని వానరగీతలో పరాశరమహర్షి చెప్పారు. ఆ శబ్దానికి సరైన నిర్వచనం శ్రీ మధ్వాచార్యులవారు తమ ఐతరేయభాష్యంలో చెప్పారు. “హనుశబ్దో జ్ఞాన వాచీచ – హనుమానితి శబ్దతః” అని హనుమంతుడనే శబ్దానికి నిజమైన అర్థం జ్ఞానవంతుడు అని చెప్పారు. కాబట్టి ఆపేరు ఆంజనేయునకు ఎలా వచ్చిందో తెలిసికొంటూ అయన దివ్యమైన చరిత్ర తెలుసుకుందాం.
వైశాఖ బహుళ దశమినాడు ఆంజనేయుడు పుట్టాడని తెలుసుకున్నాం. ఆయనకి పుట్టుకతోనే బంగారు జందెం ఉంది. ఆ వాయుసుతుడు పుట్టాక నాల్గైదు రోజులకే తల్లితో “అమ్మా నాకు ఆకలి అవుతోంది. ఆహారం పెట్టవలసింది” అని అడిగాడు. అప్పుడా తల్లి అంజన కుమారుని బుజ్జగిస్తూ “ఎక్కడైనా బాగా పక్వానకొచ్చిన పండుంటే తినవలసింది నాయనా” అని చెప్పింది. అమ్మ అనుమతి తీసికొని ఆంజనేయుడు పైకి చూశాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. బాల సూర్యుడా అంజనేయునికి ఎర్ర పండులా కన్పించాడు. ఆ బాలాంజనేయుని ఆనందానికి అంతులేదు. ఒక్కమాటు ఆకాశానికి ఎగిరాడు. అమిత వేగంతో సూర్యుని జేరి పండు అనే భ్రాంతితో అ బాల సూర్యుణ్ణి పట్టుకొన్నాడు. ఆనాడు అమావాస్య, అందులో సూర్యగ్రహణం. అప్పుడే రాహువు సూర్యుని పట్టటంకోసం వస్తున్నాడు. తాను రాకముందే సూర్యగ్రహణం మరొకరితో జరిగిపోతూ ఉండటం ఆ రాహువుకు ఆశ్చర్యం కల్గించింది. తన కార్యానికి విఘ్నమేర్పడిందని కోపమూ వచ్చింది. వెంటనే సమీపించి ‘ఓరీ వానరబాలకా! ప్రకృతి విరుధ్ధంగా సూర్యుని నీవు గ్రహించుచుంటివేమి?” అని గద్దించి ప్రశ్నించాడు. ఆ బాలాంజనేయునకు నల్లని రాహువు నేరేడుపండులా తోచాడు కాబోలు! రాహువుని పట్టుకోబోయాడు. ఎవడో అసాధ్య బాలుడుగా ఉన్నాడని భయపడి రాహువు దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి “ఓ దేవేంద్రా! సూర్యగ్రహణ నియమాన్ననుసరించి సూర్యుని నేను కబళించవలసి ఉండగా ఎవడో అసాధ్యుడైన బాలుడు కబళిస్తున్నాడు. ఈ ప్రమాదాన్ని తప్పించి విధివిధానంనడుపవలసింది” అన్నాడు. వెంటనే దేవేంద్రుడు ఐరావతన్నధిరోహించి వచ్చాడు. తెల్లని ఐరావతాన్ని చూచి ముచ్చటపడ్డ ఆ అంజనా తనయుడు దానివైపు దూకబోయాడు. దేవేంద్రునికి కోపం వచ్చింది. సూర్యుని నోటకరచిఉన్న ఆ బాలుని మహా బలసంపదకు ఆశ్చర్యమూ కల్గింది. తన కర్తవ్యాన్ని తానాలోచించుకుంటూ ఇంద్రుడు ఆ బాలుని పైకి వజ్రాయుధాన్ని విసిరాడు. బాలాంజనేయుడు అంతటి వజ్రాయుధాన్నికూడా రోమంతో అడ్డుకుంటున్నాడు. వ్యర్థమైన వజ్రాయుధాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని కూడా ఆంజనేయుడు ఒక్క రోమంతో నెట్టివేశాడు. దాన్ని చూచి దేవతలంతా ఆశ్చర్యచకితులయ్యారు. బ్రహ్మాది దేవతలందరూ కూడి ఇలా ప్రార్థించారు.
అంజనా సుప్రజా! వీర! పార్వతీశ్వరసంభవః
సమర్థోసి మహావీర మహాబల పరాక్రమ! ||
నరుణాంచ సురాణాంచ – ఋషీణాంచ హితాయవై
జగత్ప్రాణ కుమారస్త్వం – అవతీర్థోసి భూతలే ||
సత్క్రియా సప్రవర్తంలే – వేదాక్తాః క్రతపస్తధా త్యజసూర్యం”
“ఓ అంజనాదేవి కుమారుడైన వీరుడా! పార్వతీ పరమేశ్వరుడు వలన పుట్టినవాడా! మహావీరుడా! మహా బల పరాక్రమాలు కల్గిన నీవు మానవులకు, దేవతలకు ఋషులకు మేలు చేయ సమర్థుడవు. ఓ ఆంజనేయా! నీవు లోకానికే ప్రాణమైన వాయుదేవునికి కుమారుడవై అవతరించినావు. నీవు సూర్యుని పట్టుకొనటంవలన వేదోక్తములైన క్రతువులతో సహా సత్క్రియలన్నీ ఆగిపోయాయి. కాబట్టి సూర్యుని విడిచిపెట్టవలసింది” అని ప్రార్థించగానే బాలాంజనేయుడు సూర్యుని విడిచిపెట్టాడు, ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించిన ఇంద్రునికి తన వజ్రాయుధ శక్తిని కించపరచిన బాలునిపై కోపం కల్గింది. ఏ విధంగా అయినా తనది పై చేయి అనిపించుకోవాలనుకున్నాడు. ఏమరుపాటుగా ఉన్న అ బాలాంజనేయుని దవుడపై వజ్రాయుధంతో కొట్టాడు. వెంటనే మారుతి స్పృహ తప్పి శిలాతలంమీద పడ్డాడు. అతని హనువు అంటే దవుడ ప్రదేశమంతా నెత్తుటి ముద్దలా కందిపోయింది. సర్వవ్యాపకుడైన వాయువు తన కుమారుని ఈ దుస్థితిని చూచాడు.
మితిమీరిన దుఃఖం కల్గింది. దానివెంట పట్టరానికోపం ఆవరించింది. వెంటనే సర్వ శరీరములందలి ప్రాణవాయువులనూ నిగ్రహించి ఎటూ వీచక నిలిచిపోయాడు. అలా ప్రాణాలు నిగ్రహించటంతో జగద్వ్యాపారమంతా ఆగిపోయింది. లోకంలోని చైతన్యమంతా నశించి జడప్రాయమైపోయింది. దాంతో సకల దేవతలు, గంధర్వులు, సిధ్ధులు, మహర్షులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, చివరకు దేవేంద్రునితో సహా అందరూ వాయు-వాయుసుతు లున్నచోటికి వచ్చారు. వాయువును సంతృప్తి పరిస్తే తప్ప ఇక లోకాలు నిలవలేవని నిశ్చయానికి వచ్చారు బ్రహ్మాదులు. బ్రహ్మ దేవుడు తన కమండలూదకం చల్లి ఆ బాలుని మూర్ఛనుండి తేరుకొన జేశాడు. ‘వాయుదేవుడు సంతుష్టుడవునట్లుగా అందరూ ఆ బాలునకు వరాలు ప్రసాదింపవలసిందని’ బ్రహ్మ పల్కాడు. దేవతలందరూ ఇతరులెవ్వరికీ లభ్యంకాని వరాలన్నీ ఆ బాలునకు ప్రసాదించారు. దీర్ఘాయువు, బలము, పరాక్రమం, ఆరోగ్యం, పరులు సమీపింప శక్యంకాని, శక్తిని, గుణమును, బుధ్దిని, విద్యలను, తపస్సును, తేజస్సును, వాక్పటుత్వాన్ని, ప్రసన్నతను, చతురతను, పరస్త్రీ విముఖతను, అపచార సహిష్ణతను, ఏ అస్త్రంతోను సమస్త దేవగణానికి రాక్షస గణానికికూడా జయింప శక్యంకాని శక్తిని, ఇంకా పలు విధాలైన వరాలను దేవతలు ప్రసాదించారు. ఇంద్రుడు తన వజ్రాయుధంచే మరణించని విధంగా ఆంజనేయునకు వరమిచ్చాడు. ‘వజ్రాయుధంతగిలినాకూడా భగ్నంకాక ఉన్న మహా హనువు కారణంగా “హనుమంతుడు” అని నేటినుండి ప్రసిద్దనామం ఈ బాలున కేర్పడగలదని’కూడా దేవేంద్రుడన్నాడు. ఆ విధంగా ఆనాటినుండే హనుమన్నామం జగత్ప్రసిద్దమయింది. సూర్యుడు సర్వ విద్యలను ఆ హనుమంతునకు ప్రస్తాదిస్తానని తనవలె గొప్ప వర్చస్సుతో ప్రకాశింపగలడని వరమిచ్చాడు. నీటివలన కాని, తన వరుణ పాశంవలన కాని ఏ బాధా పొందకుండా వరుణుడు వరమిచ్చాడు. మృత్యువుచేత, కాలదండాలచేత, యుద్దములందు విషాదం పొందని విధంగా దండధరుడైన యముడు అనుగ్రహించాడు. తన గధాయుధం ఏ మాత్రం బాధింపదని కుబేరుడు, తన త్రిశూలంచేత మరణం లేకుండా ఈశానుడు, ఇంతవరకూ తాను నిర్మించిన అస్త్ర, శస్త్రములవలనకాని,మున్ముందు నిర్మింపబోయే శస్త్రాదులవలన కాని ఏ ఆపద, భయము లేకుండా విశ్వకర్మ వరాలను ఇచ్చారు. అనంతరం బ్రహ్మదేవుడు “ఓ ఆంజనేయా! నీవు విష్ణువులా దేవతలనుధ్దరింపగల్గుతావు. శివునిలా రాక్షసులందరినీ సంహరింపగల్గుతావు. లంకలోని రాక్షసులనుచంపి రామకార్యంలో నిమగ్నుడవై సంజీవ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని బ్రతికింపగల్గుతావు. సీతాదేవి యొక్క ఉనికిని తెలిసికొని విష్ణ్వవతారుడైన శ్రీరామునకు సంతోషం కల్గిస్తావు. ‘ఓ వాయుకుమారా! నీవు బుధ్దిమంతుడవు, గొప్ప పరాక్రమబలాలు కలవాడివి, ఏ అస్త్రమువలనా జయింపబడవు. అయినా నా మాట నాలకించి ఒక్కక్షణకాలం మాత్రం బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉండేటట్లు అంగీకరించు, అన్నాడు. త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల అంశలనుపొంది ఉండటంవల్ల త్రిమూర్త్యాత్మకుడవని నీకుకీర్తి కల్గుతుంది. సర్వదేవతల అంశలనంది ఉండటంవలన సర్వదేవమయునిగా తెలియబడుతూ ఉంటావు. అందువలననే నిన్ను పూజించటంవలన సకల దేవతలు తమను పూజించినట్లుగా తృప్తులౌతారు. ఓ పవన నందనా! రాక్షసులనుండి, దుష్ట గ్రహాలనుండి రక్షణకోసం నీకు ప్రతిగ్రామంలోను నివాసం ఏర్పడుతుంది’ అని కూడాచెప్పి బ్రహ్మదేవుడు అంతర్థానం చెందాడు. వాయువు సంతృప్తి పొందినవాడై కుమారుని అంజనాకేసరులకు అందజేసి లోకానుగ్రహ కార్యంలో నిమగ్నుడయాడు.
[wp_campaign_1]
Be First to Comment