శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – బాగుంది గురువుగారూ! అలాగే తల్లి అంజన చరిత్ర చెప్పరూ?
గురువుగారు -ఆ! అదీ చెప్పుకుందాం. అలనాటి వానరవీరులలోనే కుంజరుడు అనే మహామేటి ఒకడుండేవాడు. అతని భార్య పేరు వింధ్యావళి. ఆ దంపతులకు ఎంతకాలానికీ సంతానంకల్గలేదు. సంతానార్థి అయిన కుంజరుడు శివునిగూర్చి తపస్సు చేశాడు. అతనినిష్ఠకుమెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. కుంజరుడు పుత్రభిక్షపెట్టమని ప్రాధేయపడ్డాడు. త్రికాలజ్ఞుడయిన శివుడు ఇలా అన్నాడు. ‘ఓకుంజరా! నీ పురాకృత కర్మననుసరించి నీకు పుత్రసంతతికాని, పుత్రికా సంతతికాని కల్గే అవకాశంలేదు. కాని నీకొక ఋషిపుత్రిక లభ్యమౌతుంది. ఆమెనే కన్నబిడ్డగా పెంచుకుంటే నీవంశం ఉధ్ధరింపబడుతుంది’ అన్నాడు. అలాఅని శివుడు అంతర్థానంచెందాడు. కుంజరుడు జరిగినదంతా భార్య అయిన వింధ్యావళితో చెప్పి పరమశివుడు చెప్పిన శుభ ముహూర్తం కోస ఎదురు చూస్తూఉన్నాడు.
గౌతమ మహామునికి అహల్యయందు శతానందుడు అనే కుమారుడు, అంజన అనే కుమార్తె పుట్టారు. అహల్య ఇంద్ర సూర్యులచేత వంచితరాలై శిలగా ఉండిపోయింది. గౌతముడు మాతృవిహీనులుగా ఉన్న బిడ్డలను చూశాడు. వీరినెలా పోషిస్తావా అనుకుంటూ బాధపడ్డాడు. ఇంతలో నారదుడు వచ్చాడు. “గౌతమునీంద్రా! విధి విధానం ఎవ్వరూ మార్చలేరు. నీవు ఈ బిడ్డలను పోషింపలేవు. కాబట్టి యీ శతానందుని తత్వవేత్త అయిన జనకమహారాజు దగ్గరకు పంపు. ఈ నీ కుమారుడు భవిష్యత్తులో ఆయన ఆస్థాన పురోహితుడవుతాడు. సంతానహీనుడై కుంజరుడు అనే వానరశ్రేష్టుడు శివుని వరం సంపాదించుకొని ఉన్నాడు. ఈ అంజనను కుంజరునకు కుమార్తెగా యియ్యి” అన్నాడు. ఆ విధంగానే గౌతముడు అంజనను కుంజరున కిచ్చాడు. ఇప్పుడు మన అంజన కుంజరునికి పెంపుడు కుమార్తె అయింది. అల్లారు ముద్దుగా పెరుగుతోంది. క్రమంగా అంజన యౌవనవతి అయింది. కుంజరుడు యుక్తవయస్సు వచ్చిన తనకుమార్తెకు తగిన వరుని అన్వేషించటంలో నిమగ్నుడయ్యాడు. శంబసాధనుణ్ణి సంహరించి తమకు మేలు చేసిన కేసరికి మంచి కన్యను చూచి వివాహం చేయటంద్వారా ప్రత్యుపకారం చేయాలని దేవతలూ ఎదురుచూస్తున్నారు.
కేసరికి, అంజనకు అనుకూలదాంపత్యం ఏర్పడుతుందని ఉభయపక్షాలవారూ భావించారు. వారిద్దరికీ వైభవోపేతంగా వివాహం జరిగింది. వారి అనుకూలదాంపత్యంలో సంతోషాలు పండించుకొంటూనే ఉన్నారు. కాని సంతానం మాత్రం ఎన్నాళ్ళకూ కల్గలేదు. ఆ విచారం వారిని మరీ బాధింపసాగింది. అంజనకు తన భర్త వంటి మహావీరుడైన కుమారుని కనాలనే కోరిక తీవ్రమయింది. భర్తవల్ల తాను వీరపత్నిగా గౌరవింపబడుతోంది. పరాక్రమవంతుడైన కుమారునికని తాను వీరమాతగా కీర్తి పొందాలని అంజన కోరిక. దైవానుగ్రహం సంపాదించటంవల్లనే ఏదయినా సాధ్యమౌతుందని భావించింది. భర్తను ప్రార్థించి తపస్సుచేయటానికి అనుమతి సంపాదించింది. పతి పాదాలకు మ్రొక్కింది.
మతంగ మహాముని ఆదేశాన్ననుసరించి నేడు తిరుపతిగా చెప్పబడే ఆనాటి వృషభాద్రిని చేరింది. ఆకాశ తీర్థంలో స్నానంచేస్తూ ఇంద్రియము లన్నింటినీ నిగ్రహించి తపస్సు చేయనారంభించింది. ఆమెయం దనుగ్రహంతో వాయుదేవుడు ప్రతిరోజూ ఒకఫలాన్ని అర్పిస్తూ ఉండేవాడు. అలఆర్పిస్తూ ఒకరోజు పార్వతి-అగ్ని దేవులద్వారా తనకు చేరిన శివతేజస్సును ఫలరూపంలో ఆమె చేతిలో పడవేశాడు. ఆమె పండుగానే భావించి దాన్ని తిన్నది. క్రమంగా ఆ పతివ్రత అవయవాల్లో గర్భచిహ్నాలు ఆరంభమైనాయి. ఆ పరిస్థితిని గుర్తించి అంజన తన కీ వికారాలేమిటని సిగ్గుపడింది. ఆశ్చర్యపడింది. అటువంటి అకారణ గర్భంవలన తన పాతివ్రత్యానికి భంగం కల్గెనేమో అని భయపడ్డది. కాని తనధ్యానం వీడలేదు. అలాంటి భయంతో ఉన్న అంజనతో ఆకాశవాణి ‘మాభూత్తే వ్రతభంగోయం, మా విషీదవరాననే దేవప్రసాదాత్తే గర్భే – మహావ్యక్తిర్భవిష్యతి’ ‘ఓఅంజనాదేవి! నీకు వ్రతభంగమేమీ కల్గలేదు. నీవు దుఃఖింపవలసిన పనిలేదు. భగవదనుగ్రహం వలన నీ గర్భాన గొప్పవ్యక్తి పుట్టబోతున్నాడు’ అని చెప్పింది. ఆమాటవిన్న కేసరి, అంజన ఆనందానికి మేరలేదు. అలా ఆనందంగా కాలం గడుస్తూ ఉండగా అంజన “వైశాఖేమాసి కృష్ణాయాం – దశమీ మందసంయుతా పూర్వప్రోష్ట పదాయుక్తా – తధావై ధృతిసంయుతా, తస్యాం మధ్యాహ్న వేళాయాం. జనయామాస వై సుతమ్”. వైశాఖమాసంలో, కృష్ణ పక్షంలో దశమి తిధినాడు, శనివారం రోజున పూర్వాభాద్రా నక్షత్రము, వైధృతీయోగం కలరోజు, మధ్యాహ్న సమయంలో, కర్కాటక లగ్నంలో ఒక కుమారుని కన్నది. ఆ బాలుడు మహాబాలుడు. భావి పరాక్రమ సంపన్నుడు. విష్ణుభక్తి తత్పరుడున్ను. ఆతడు సర్వదేవమయుడు, బ్రహ్మ విష్ణుశివాత్మకుడు, వేద వేదాంగ తత్వజ్హ్ణుడు, సర్వ విద్యా విశారదుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడు, సకలదర్శనాలకూ అంగీకరింపదగినవాడు. ఇంకా ఆ బాలుడు మాణిక్యాలు పొదిగిన కుండలాలు ధరించిఉన్నాడు. దివ్యమైన పట్టువస్త్రాలు దాల్చి ఉన్నాడు. అతడు బంగారుకొండగా చెప్పబడే మేరుపర్వతంతో సమానమైనవాడు. పింగళవర్ణంకల నేత్రాలు కల్గినవాడు. బంగారు మాలికను, స్వర్ణ యజ్హ్ణోపవీతాన్ని ధరించినవాడు. మణులు పొదిగిన నూపురాలతో ఒప్పుతూ ఉన్నాడు. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము అనే శుభచిహ్నాలు పాదాలలో ఉన్నవాడు, పొడవైన తోక కలవాడు, గొప్పదేహం కలవాడు. అతడు పెద్ద దవడలుకల్గి ఉన్నాడు. కటి సూత్రము, కౌపీనములతో ఒప్పుచున్న అతడు గొప్ప బాహువులు కలవాడు, లోకాలనే ఆశ్చర్యపరచజాలిన వజ్రదేహంకలవాడు. కపిరూపంలో ఉన్నవాడు సమస్త శుభ లక్షణాలతో కూడినవాడు బంగారుకిరీటము, భుజకీర్తులు ధరించినవాడున్ను. అతడు అమితమైన కాంతిచే వేరొక విష్ణ్వవతారమా! అనిపించేటట్లున్నాడు. అటువంటి అద్భుత బాలుడు అంజనకు జన్మించాడు.
ఆ మహనీయుడు పుట్టిన శుభసమయంలో ఆకాశంనుండి పుష్పవర్షం కురిసింది. స్వర్గంలో దేవదుంధుభులుమ్రోగాయి. దేవగంధర్వలు నృత్యాలు చేశారు. సిద్ధులు, చారణులు స్తోత్రాలు చేశారు. ప్రపంచమంతటా ఒక్కసారి సుఖవాయువులు వీచాయి. నదులు స్వచ్చమైన ఉదకాలతో ప్రవహించాయి. ప్రకృతి అంతా పులకించిపోయింది. మహదానందంతో పరవసించింది. కేసరి ధర్మపత్ని అయిన అంజనాదేవి కపి శ్రేష్టుడైన బాలుని ప్రసవించిన ఆ సమయంలో మునుల యొక్క గార్హవత్య, ఆ హవనీయ, దక్షిణాగ్నులు మూడూ ప్రదక్షిణాకారంగా జ్వాలలతో ప్రకాశించాయి. పూల వాసనలతొ గాలులు గుబాళించాడు. మొగ్గలతో కూడి చిగురించియున్న చెట్లు కూడా ఆనందిస్తున్నట్లు కన్పడ్డాయి. పూలలో తేనె ప్రవహిస్తూ ఉండగా ఆ మధువును ఆస్వాదిస్తూ తుమ్మెదలు ఘీంకారాలతో వనమంతా సంచరింపసాగాయి. దేవతలందు, ప్రకృతియందు ఇలాంటి శుభచిహ్నాలు ద్యోతకమవుతూఉన్న అదేసమయంలో రాక్షసుల కిరీటాలలో పొదిగిన రత్నాలు అకారణంగా రాలిపడిపోనారంభించాయి. ఆ రక్కసిమూకల స్త్రీల మనస్సులలో పుట్టని గర్భస్థ శిశువులుకూడా కంపించి పోయేటంతటి భయాలు ఆవేశించాయి. ఈ విధంగా సజ్జనులకు ఆనందాన్ని, దుర్జనులకు దుఃఖాన్ని పుట్టుకతోనే కల్గిస్తూ అంజనకు కుమారుడు జన్మించాడు. అంజనకు పుట్టిన కారణంగా ఆ బాలుడు ఆంజనేయుడు అని పేరుపొందాడు. కేసరికి కుమారుడయినందున కేసరినందనుడుగా ప్రఖ్యాతుడయ్యాడు. వాయువు వరప్రసాదంవలన జన్మించిన కారణంగా వాయునందనుడు, అనిలసుతుడు, పవనతనయుడు, అనిలకుమారుడువంతి పేర్లతో ప్రసిధ్దుడు. శివుని అనుగ్రహంమేరకు శివ వీర్యాన్ని ధరించిన అగ్నికికూడా ఈ బాలుడు కుమారుడుగా కీర్తింపబడుతూ అగ్ని సంభవుడనికూడా విఖ్యాతుడయాడు. పార్వతీదేవి గర్భమునందు తొలుదొల్త ప్రవేశించినవాడు కాబట్టి పార్వతీనందనుడనికూడా ఆ బాలునకు పేరు వచ్చింది. శివుని తేజస్సువలన జన్మించినాడవటంవలన రుద్రవీర్య సముద్భవుడని, ఈశ్వరాంశ సంభూతుడని, శంకరసుతుడని కూడా విఖ్యాతి ఏర్పడింది. బదరికావనంలో సకలదేవతల నుండి తేజస్సు ఆకర్షింపబడి శివునకు సమర్పింపబడింది కాబట్టి ఆతడు సర్వదేవతుడుగాకూడా కీర్తింపబడ్డాడు. అందువల్లనే “ఆంజనేయః పూజితశ్చేత్ – పూజితాస్సర్వదేవతాః” అని ఆంజనేయుని పూజించటంవలన సకలదేవతలను పూజించినట్లే అని బ్రహ్మదేవునిచేతనే చెప్పబడింది. అటువంటి ఆంజనేయుడు శుభముహూర్తంలో అంజనకు జన్మించాడు. (ఇంకా వుంది….)
[wp_campaign_1]
Be First to Comment