శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్
శిష్యుడు – ఒక్కమాట గురువుగారూ! ఆ కశ్యపుడే హనుమంతుని తండ్రి అయిన కేసరిగా జన్మించాడన్నారు బాగానే ఉంది. హనుమంతునంతటి వాని తండ్రిగా ఆయనకుగల శక్తియుక్తులేమిటో తెలుసుకొందామనుంది.
గురువుగారు – ఆ అదే చెప్పుకుందాం. కేసరి అరవై వేల మంది వానరులకు నాయకుడు. మహాబలవంతుడు. బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ గొప్పతపస్సుచేసి ఎన్నో శక్తులు సంపాదించాడు. ప్రభాసతీర్థ పరిసరాలలో ఎంతో మంది ఋషులు నివసిస్తూ ఉంటారు. శంఖము, శబలము అనే రెండు ఏనుగులు ఒకప్పుడు విజృంభించి ఆ మునిగణాన్ని హడ లెత్తించాయి. వాటివలన భయంతో, మునులు పరుగులెత్తసాగారు. అది తెలిసిన ఆ వానర వీరుడు శంఖశబలాలను వెంటాడి పట్టి రెంటిని సంహరించాడు. ఆ విధంగానే ఆ కపి వీరునికి ‘కేసరి’ అనే సార్థక నామధేయం ఏర్పడింది.
ఆ రోజుల్లో శంబసాధనుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సుచేసి మెప్పించాడు. ముల్లోకాలూ జయింప గల్గాలని వరం కోరాడు. బలగర్వంతో దేవతలను, మునులను అమితంగా బాధించడం మొదలుపెట్టాడు. వాడు పెట్టే బాధలు భరింపలేక దేవతలు వాణిపతిని శరణుజొచ్చారు. బ్రహ్మ వారిని చూసి ‘ఓ దేవతలారా! ఈ శంబసాధనుణ్ణి సంహరింపగలవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ మహావీరుడు కేసరి అనే సార్థక నామధేయం కలవాడు. సుపర్వగిరిపైన సంచరిస్తూ ఉంటాడు’ అన్నాడు. వెంటనే ఆ ఋషిగణం కేసరి దగ్గరకు వెళ్ళారు. తమను శంబసాధనుడు బాధిస్తున్న రీతి అంతా వివరించారు. వాడి బారినుండి తమను రక్షింపవలసిందిగా ప్రార్థించారు. కేసరి వారికి అభయమిచ్చాడు.
అప్పుడు కలహభోజనుడు నారదునికి పండుగ వచ్చినట్లయింది. వెంటనే శంబసాధనుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలు కేసరి దగ్గరకువెళ్ళి మొరపెట్టుకొనడం, కేసరి వారికి అభయమివ్వటం వంటి విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. విషయాన్ని విన్న ఆ రాక్షసుడు శంబసాధనుడు మండి పడ్డాడు. ఖడ్గాన్ని ధరించి భూమి దద్దరిల్లేటట్లు పరుగులు పెట్టాడు. కేసరి దగ్గరకువెళ్ళి దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ‘ఓరీ వానరాధమా! నీవేనా దేవతలను రక్షించేది? నీకు రోజులు సమీపించాయి. కాబట్టే నాతో విరోధం పెట్టుకున్నావు. శంకరాదులే నేనంటే భయపడుతుండగా నీవా? నాతో యుధ్దంచేసేది! కాచుకో, అంటూ కేసరిపై ఖడ్గం విసిరాడు. కేసరి దాన్ని పట్టి సగానికి విరిచాడు. వెంటనే ఒక పర్వతశిలను ఎత్తి శంబసాధనుని మీదకు విసరగానే వాడు ప్రక్కకి తప్పుకున్నాడు. వారిర్వురి మధ్య ముష్టియుధ్దం మొదలయింది. వజ్ర శరీరుడైన కేసరి ధాటి కారాక్షసుడు నిలవలేదు. చివరికి కేసరి పిడికిటిపోటు పొడిచాడు. దాంతో అ రక్కసుడు రక్తం కక్కుకుంటూ నేలకొరిగాడు. దేవతలందరూ పరమానందమందారు. ఇది ఆయన తండ్రియైన కేసరిచరిత్ర.
[wp_campaign_1]